ప్రేమించిన వాడితో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ... ఓ యువతి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసముండే ఒక కుటుంబం కూకట్పల్లి జేఎన్టీయూ సమీపంలో హోటల్ నడుపుతోంది. బాచుపల్లికి చెందిన ఆటోడ్రైవర్ రవి గౌడ్ హోటల్‌కు అవసరమైన సరుకులు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని కుమార్తెతో చనువు ఏర్పడింది. ఆమెతో కొన్నేళ్లుగా ప్రేమయాణం సాగించాడు. వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. యువతి తనను వివాహం చేసుకోవాలని నిలదీసింది. రవి మొహం చాటేశాడు.
అతనికి అప్పటికే వివాహమై భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అయినా అతడితోనే వివాహం జరిపించాలని బాధితురాలు బాచుపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది. స్టేషన్‌కు రాకముందే ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని, ప్రస్తుతం అమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: దిల్లీ నూతన ఎమ్మెల్యేల్లో 50 శాతానిది ఆ నేపథ్యమే