త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో (HUZURABAD BYELECTIONS)కమలం వికాసం తథ్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధీమావ్యక్తం చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర తొలిదశ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో.. ఎలాంటి ఆటంకాలు లేకుండా తొలిదశ ప్రజాసంగ్రామయాత్ర పూర్తైందంటూ సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు.
'భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసంగ్రామయాత్రను చేపట్టాను. అమ్మవారు ఇచ్చిన బాధ్యతను.. ఆ తల్లి కరుణతో నేరవేర్చాను. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజాప్రవాహం మధ్య తొలిదశ పాదయాత్ర పూర్తయింది. కాషాయ కంకణం కట్టుకున్నాం.. కమలం గుర్తును గెలిపిస్తాం.'
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
36 రోజులు.. 348 కిలోమీటర్లు..
ఆగస్టు 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని.. 18 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 348 కిలో మీటర్లకు పైగా సాగింది. మొత్తం 36 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ప్రజాసమస్యలు సహా తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకుసాగారు. మధ్యలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించారు.
ఇదీచూడండి: Husnabad Bjp Meeting: తొలి సంతకం ఉచిత విద్య, వైద్యంపైనే..: బండి సంజయ్
హుస్నాబాద్ సభలో సంజయ్..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తొలిదశ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం తథ్యమని.. తెరాస డిపాజిట్ కాపాడుకోవటం కోసం కష్టపడుతోందని తెలిపారు. 'ప్రజా సంగ్రామ యాత్ర'లో తన వెంట నడిచిన కార్యకర్తలందరికి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో మొత్తం 348 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నట్టు బండి సంజయ్ తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దయ, కార్యకర్తల అండతో... ఎండలో ఎండి, వానలో తడుస్తూ.. 36 రోజులు పాదయాత్ర చేసినట్టు వివరించారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, భూనిర్వాసితులు... ఇలా ఎందరో తమ బాధలను చెప్పుకున్నట్టు తెలిపారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని.. ఇప్పటికీ.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని మండిపడ్డారు. 'వరి వేస్తే ఉరే' అని రైతులను కేసీఆర్ భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడికి వెళ్లినా... సమస్యలే స్వాగతం పలికాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచూడండి: Bandi Sanjay speech: 'రేపటి హుజూరాబాద్ మనదే.. ఆ తర్వాత తెలంగాణ మనదే'