BJP State President Kishan Reddy Meet The Press 2023 : ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ వచ్చిందో.. దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పాలన ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. అధికారంలోకి రాకముందే కేసీఆర్ మాట తప్పారని అన్నారు. ముఖ్యమంత్రి నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy Fires on CM KCR : '30 రోజులు పోరాడితే రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడొచ్చు'
Kishan Reddy Comments on KCR : రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇవాళ తెలంగాణలో సాధారణ ప్రజలు సీఎంను కలిసే అవకాశం లేదని.. కొత్త సచివాలయానికి కూడా కేసీఆర్ రావడం లేదని విమర్శించారు. ఉద్యోగ నియామకాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. 10 ఏళ్లుగా ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు.
కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతారు : ముఖ్యమంత్రిపై యువత కోపంతో ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ (KCR) గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుందని అన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పన్ను వసూలు చేస్తోందని ఆరోపించారు. కర్ణాటక నుంచి రూ.కోట్లు తెలంగాణలోకి వస్తున్నాయని ఆరోపించారు. అమలు చేయలేని హామీలను హస్తం పార్టీ ఇస్తోందని దుయ్యబట్టారు. మూడు వందేభారత్ రైళ్లను తెలంగాణకే కేటాయించామని కిషన్‌రెడ్డి వివరించారు.
మేడిగడ్డ బ్యారేజీని చూస్తే కడుపు తరుక్కుపోతోందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సూపర్ ఇంజినీర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబ పాలన తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక భద్రాచలంలో రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించలేదని విమర్శించారు. తన నాయకత్వాన్ని అంగీకరిస్తే దేశంలోని అన్ని పార్టీలకు డబ్బులు సమకూరుస్తానని కేసీఆర్ చెప్పినట్లు దిల్లీలోని రిపోర్టర్ చెప్పారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికలను కేసీఆర్ డబ్బుమయం చేశారు : సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాష్ట్రంలో లేదని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. ఎన్నికలను కేసీఆర్ డబ్బుమయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని తెచ్చానని కేసీఆర్ అంటున్నారని.. బీజేపీ మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులు సీఎంను కలిసే అవకాశం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Kishan Reddy Fires on BRS : "బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. యువత నిశ్శబ్ధయుద్దం చేస్తోంది"
రాష్ట్రంలో 88 సీట్లు ప్రకటించామని.. రెండు రోజుల్లో మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని కిషన్‌రెడ్డి వివరించారు. బడుగు బలహీవర్గాలకు రాజ్యాధికారం కోసం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని.. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావడం మార్పు కాదని తెలిపారు. కేసీఆర్ హస్తం పార్టీ ప్రోడక్ట్ అని.. ఆయన ఆ పార్టీ నుంచే నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌తో ఎలాంటి సంబంధం లేదు : కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. భారత్ రాష్ట్ర సమితితో ఇప్పటివరకు బీజేపీ పొత్తు పెట్టుకోలేదన్నారు. తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే పార్టీతో కమలం పార్టీ కలవదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్‌ఏ ఒక్కటేనని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.
"పార్టీ ఆదేశానుసారమే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రగతి భవన్ కాదు.. కేసీఅర్ కుటుంబ ప్రగతి భవన్. అధికారంలోకి వచ్చాక ప్రజా ప్రగతి భవన్‌గా మారుస్తాం. 54 శాతం ఉన్న బీసీలంతా ఏకమైతే.. ఆ ఉప్పెనలో అందరూ కొట్టుకుపోతారు. జర్నలిస్టుల సంక్షేమానికి చిత్తశుద్ధితో ఉన్నాం. జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. రాజకీయ పార్టీలు మహిళలకు సీట్లు ఇవ్వడం లేదు కాబట్టే మహిళా బిల్లు తీసుకువచ్చాం. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తాం. గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయి కమిటీల వరకు మహిళలకు అవకాశం కల్పిస్తాం." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్‌కు నేను ఎందుకు అనుకూలంగా ఉంటాను? : కేసీఆర్‌కు తాను ఎందుకు అనుకూలంగా ఉంటానని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీకి, సిద్ధాంతానికి మాత్రమే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కవిత, సోనియాగాంధీ అరెస్ట్ విచారణ సంస్థల బాధ్యతని అన్నారు. కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? అని తెలిపారు. సోనియా, రాహుల్‌ను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్‌తో.. భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉన్నట్లా? అని అన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేసీఆర్ అనుమతిస్తే.. 2 గంటల్లో సీబీఐ ఇక్కడికి వస్తుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
'కాళేశ్వరం అట్టర్ ఫ్లాప్ - ప్రాజెక్టు భవిష్యత్‌పై తెలంగాణ సమాజం ఆందోళన'