నేడు చేపట్టిన భారత్ బంద్ పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసమే రైతులను రెచ్చగొట్టి బంద్‌ను చేపట్టేలా చేశాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి ఎందుకు బయటకు రాలేదని ఆయన నిలదీశారు. వ్యవసాయ చట్టాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పడంలేదని ఆక్షేపించారు.
త్వరలో ఉద్యోగ, ఉపాధ్యాయ పింఛన్ల సమస్యలపై భాజపా ఆధ్వర్యంలో త్వరలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. పింఛన్ల సమస్యలపై మున్సిపల్ కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. భాజపా చేపట్టే ఆందోళనలకు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలపాలని బండి విజ్ఞప్తి చేశారు. ఐఆర్, పీఆర్‌సీ విషయంలో సీఎం కేసీఆర్ స్పందించాలని... భాజపా చేపట్టే ఆందోళనలతో ప్రభుత్వం దిగిరావాలన్నారు. తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదని... కొంతమంది పోలీసుల వ్యవహార శైలికి మాత్రమే వ్యతిరేకమన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా చేయవద్దన్నారు.
బంద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటే ఎందరిని అరెస్టు చేశారని పోలీసులను బండి సంజయ్ ప్రశ్నించారు. భాజపా చేపట్టే ఆందోళనలకు కూడా పోలీసులు సహకరించాలని ఆయన అన్నారు. భాజపాకు వ్యతిరేకంగానే పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని బండి సంజయ్ మండిపడ్డారు.
ఇదీ చూడండి: రైతన్నల పోరాటానికి మద్దతుగా నిలిచిన మంత్రులు, తెరాస శ్రేణులు