Bandi Sanjay on Budget: బడ్జెట్‌పై ప్రశ్నిస్తారనే కేసీఆర్ భయపడి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టిన నీచమైన ప్రభుత్వం ఒక్క తెరాస మాత్రమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. ఇదే మీకు చివరి బడ్జెట్ అయినందున అబద్ధాలను అసెంబ్లీలో ప్రవేశపట్టారని ఆరోపించారు.
ప్రశ్నించకూడదనే సస్పెండ్
బడ్జెట్‌పై ప్రశ్నించకూడదనే.. సభ ఎన్నిరోజులు జరుగుతుందో తెలియక ముందే ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభ్యులు ప్రశ్నిస్తారనే ముందస్తుగా రాసుకుని వచ్చిన స్క్రిప్ట్ మేరకే సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్షాలు వద్దనుకుంటే సమావేశాలు ప్రగతి భవన్లో పెట్టుకోవాల్సిందని ఎద్దేవా చేశారు. ఈ అబద్ధాల మంత్రి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. మహారాష్ట్రలో భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ఏం జరిగిందో తెలుసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు.
వాళ్ల బండారమంతా బయట పెడతారని భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. కేంద్రాన్ని తిట్టడం తప్ప బడ్జెట్లో ఏం లేదు. అన్ని విషయాలపై మేధావివర్గం అడుగుతారని చర్చ జరగకుండా ప్లాన్ ప్రకారం చేసిండ్రు. మీ కుటుంబమంతా కలిసి ప్రగతిభవన్‌లో పెట్టుకుంటే ఏ ఖర్చు ఉండదు కదా. నీ లోపల భయం కనపడుతున్నది. గవర్నర్‌ను ఆహ్వానించి మీరేం సాధించారో చెప్పాలి. మీరు ఏం చేయలేదు కాబట్టే గవర్నర్ ప్రసంగం రాకుండా అడ్డుకున్నారు. భాజపా ఎమ్మెల్యేలను చూస్తేనే సీఎం వణుకుతారు. మహారాష్ట్రంలో 12 మందిని సస్పెండ్ చేస్తే ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోండి. నీవు నిజాయితీగా పాలిస్తే మా సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయ్. ముఖ్యమంత్రికి ఆ ధైర్యముందా? గతంలో రేవంత్ రెడ్డి చేయి ఎత్తితేనే సస్పెండ్ చేసిండ్రు. దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలా? ఇదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. దీనిపై గవర్నర్ కలుస్తామని.. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. దొడ్డి దారిన ప్రతిపక్షాలను దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి
అసెంబ్లీలో ఈ రోజు జరిగిన సంఘటనపై కాంగ్రెస్ వైఖరేంటో ఏంటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా చేయి ఎత్తితేనే సస్పెండ్ చేశారని తెలిపారు. తెరాస ఎంపీలు పార్లమెంట్లో స్పీకర్ వద్దకు వెళ్లి ఎన్ని రోజులు ధర్నాలు చేసినా సస్పెండ్ చేయలేదని వెల్లడించారు. శాసనసభలో కూర్చునే అర్హత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదన్నారు.