రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్.. దిల్లీలో పొర్లుదండాలు పెడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకే లేని ఉద్యమానికి బంద్ ప్రకటించారన్న ఆయన.. దిల్లీకి వచ్చి రైతులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పేరుతో దోచుకునే యత్నంలో భాగంగానే డీపీఆర్‌లు ఇవ్వటంలేదన్నారు. వరంగల్, కరీంనగర్‌లకు స్మార్ట్‌సిటీల కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినా... ముఖ్యమంత్రి పక్కదోవ పట్టించారని ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్ అంచనాలు పెంచారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రాజెక్టు అంచనాలను రూ.20 వేల కోట్లు పెంచారని పేర్కొన్నారు. పాత ప్రాజెక్టు, ఒక్క ఎకరానికి అదనంగా నీరు ఇవ్వకపోతే ప్రాజెక్టు ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు.
రూ.20 వేల కోట్లు ఎవరి జేబులు నింపేందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి బాగోతం స్వయంగా వారే బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచినందుకు డీపీఆర్ ఇవ్వాలని కేంద్రం కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటో తెలియడం లేదన్నారు. రాష్ట్రానికి అదనంగా నిధులు ఇవ్వాలంటే డీపీఆర్ ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'రైతు ధైర్యంగా అడుగేయనంతవరకు ప్రపంచంతో పోటీ పడలేం'