రాష్ట్రంలో తెరాస నేతలు దళితుల భూములను లాక్కోవడం, అక్రమాలకు పాల్పడటం నిత్యకృత్యమైందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో ఎస్సీ వర్గానికి చెందిన నర్సింహులు అనే రైతు పురుగుల మందు తాగి మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.
సీఎం నియోజకవర్గంలో జరిగిన ఈ ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యగానే భాజపా భావిస్తోందని ప్రేమేందర్రెడ్డి పేర్కొన్నారు. తెరాస నేతల అక్రమాలను సీఎం పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై వాస్తవాలు తెలుసుకోవడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిజ నిర్ధారణ కమిటీని వేశారని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ సభ్యులు నేడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు