BJP Workers Besieged MLA Camp Offices : రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చలేదని.. నిరసనగా ఆందోళనలు చేయాలన్న పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుతో.. నాయకులు ఎక్కడికక్కడ నిరసనకు దిగారు. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, హుస్నాబాద్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడికి కమలం (BJP) నేతలు యత్నించారు.
మెదక్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి యత్నించిన.. కమలం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని స్టేషన్లకు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు మిన్నంటాయి. ఇచ్చిన హమీలు నేరవేర్చలేదంటూ.. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు వ్యతిరేకంగా.. వర్థన్నపేటలో కాషాయ శ్రేణులు ధర్నాకు దిగారు.
దీంతో ఖమ్మం జాతీయ రహదారిపై నిరసన చేపట్టడంతో.. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ క్యాంపు కార్యాలయాన్ని (BJP Protest MLA Camp Offices) బీజేపీ శ్రేణులు ముట్టడించారు. ఈ క్రమంలో కమలం కార్యకర్తలకు.. పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వరంగల్ తూర్పు, నర్సంపేట ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడికి.. కమలం కార్యకర్తలు యత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నించగా.. ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు.
చొప్పదండి ఎమ్మెల్యే కార్యాలయంలోకి కమలం కార్యకర్తలు దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించిన కమలం శ్రేణులు.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేయాలంటూ ధర్నాకు దిగారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే ఆఫీస్‌ను ముట్టడించారు. అర్హులైన వారందరికీ గృహలక్ష్మీ పథకంలో అవకాశం కల్పించాలని.. అదే విధంగా అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తుంగతుర్తిలో గాదిరి కిషోర్ ఇంటి ముట్టడికి కమలం కార్యకర్తలు యత్నించారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలంటూ నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది.
కామారెడ్డి జిల్లా బిచ్కుందలో.. ఎమ్మెల్యే హన్మంత్ షిండే నివాసాన్ని ముట్టడించేందుకు కమలం పార్టీ యత్నించింది. గద్వాల జిల్లాలోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన బీజేపీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్‌లో బీజేపీ చేపట్టిన.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.
BJP Comments on BRS MLA Candidates 2023 : 'దమ్ముంటే ఈటలపై పోటీ చేయ్.. కేసీఆర్'