BJP MP Laxman: రాష్ట్రంలో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. సొంతంగానే అధికారం దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో పవన్‌కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెదేపాతో పొత్తు అనేతి కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామన్నారు.
కమ్యూనిస్టులను సీఎం కేసీఆర్ సూది, దబ్బనం పార్టీ అంటూ వెక్కిరించినా ఇంకా బుద్ది రాలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బిహార్ పర్యటనతో నవ్వుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ అమాయకుడని తెలిపారు. కేసీఆర్ ఉచ్చులో చిక్కుకుని ఆయన అలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎన్డీఏలోకి తెదేపా వస్తోందనేది కేవలం ప్రచారమే. తెలంగాణలో సొంతంగానే అధికారం దక్కించుకుంటాం. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తాం. ఏపీలో జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయి. ఏపీలో జగన్ పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటాం. -కె. లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ
నితీశ్ కుమార్ అసహనంతో చిరాకుతో లేచి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కూసోమని బతిమాలుకున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. గల్వాన్ అమర వీరులకు కేసీఆర్ సాయం చేయడంలో తప్పులేదన్న అయన.. కొండగట్టు ప్రమాద బాధితులకు ఆదుకునేందుకు మనస్సెందుకు రాలేదని ప్రశ్నించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో తెరాస, కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నారని కె.లక్ష్మణ్ ఆరోపించారు.
ఇవీ చదవండి: మునుగోడు ఉపఎన్నికలో తెరాసకే మా మద్దతు: తమ్మినేని వీరభద్రం