Raghunandanrao on TG IPS Postings: ఐపీఎస్‌ల పోస్టింగుల్లో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బరాబర్ తెలంగాణ ఐపీఎస్ అధికారుల తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన డీజీపీ అంజనీకుమార్‌ను తక్షణమే ఏపీకి పంపించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. డీజీపీ అంజనీకుమార్ ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారి అని పేర్కొన్నారు. మిగతా ఐపీఎస్‌లకు కూడా న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన 93 మంది ఐపీఎస్‌ల బదిలీల్లో నాలుగు కీలక పోస్టులు బీహార్ అధికారులు అంజనీకుమార్, సంజయ్ కుమార్ జైన్, షనవాజ్ ఖాసీం, స్వాతిలక్రాలకు కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ అణచివేతలో కీలకంగా వ్యవహరించిన స్టీఫెన్ రవీంద్రకు మాత్రమే సైబర్ కంట్రోల్ ఐజీగా బాధ్యతలు అప్పిగించారని రఘునందన్‌రావు మండిపడ్డారు.
'డీజీపీ అంజనీకుమార్ ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారి. అంజనీకుమార్‌ను ఏపీకి పంపాలని బీజేపీ పోరాడుతోంది. సోమేశ్ కుమార్‌ను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం 93 మంది ఐపీఎస్‌ల బదిలీ చేపట్టింది. దానిని వచ్చే ఎన్నికల టీమ్‌గా ప్రజలు భావిస్తున్నారు. ఒక్క ప్రాధాన్యత కలిగిన ఐపీఎస్ పోస్టు కూడా తెలంగాణ అధికారికి ఇవ్వలేదు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారికి కీలక పోస్టులు ఇచ్చారు.'-రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ ఎంఐఎం బీ-టీమ్ : కేసీఆర్‌కు తెలంగాణకు మధ్య విడదీయరాని బంధం ఉందని కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడంపై రఘునందన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరుకే చెబుతున్నారు తప్ప ఆచరణలో మాత్రం పాటించడ లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎంఐఎం బీ-టీమ్ అని రఘునందన్‌రావు ఆరోపించారు. రూపాయి నాణానికి ఒకవైపు బీఆర్ఎస్ అయితే.. మరోవైపు ఎంఐఎం అని ఆయన విమర్శించారు. తెలంగాణ వారికి మంచి పోస్టులు ఇవ్వడం లేదని అప్పుడే కొట్లాడినమని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆత్మగౌరవాన్ని మించింది ఏం లేదని ఉద్యమ సమయంలో పోరాడామని అన్నారు. జలదృశ్యంలో కేటీఆర్, కవిత లేరన్న ఆయన.. కేసీఆర్ కరీంనగర్ ఎంపీ ఎన్నికల తర్వాత కేటీఆర్ పార్టీలో చేరారని తెలిపారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోవడంతోనే టీవీల్లో మాట్లాడాల్సి వస్తోందన్నారు. 4 కోట్ల మంది తమ కుటుంబం అయితే.. మరి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ఎందుకు అదుకోవడం లేదని రఘునందన్‌రావు మండిపడ్డారు.
ఇవీ చదవండి: