BJP protests after arrest of Bandi Sanjay: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో రాజీనామా చేయాల్సిన ముఖ్యమంత్రి.. ఎస్ఎస్సీ పేపరు అంశంలో సంబంధం లేని బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేయించారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిజాం రాచరిక పాలన సాగించేందుకు.. బీజేపీ ఉద్యమాలను కేసీఆర్ సర్కార్ అణిచివేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. కుటుంబ పాలనను సాగనంపేందుకు ప్రతి కార్యకర్త ఉద్యమ స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Raghunandan comments on Bandi Sanjay arrest: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం రాజకీయ రంగు పులమడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపకుండా అధికార పార్టీకి పావులుగా మారొద్దని హితవు పలికారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశం పక్కదోవ పట్టించేందుకే సంజయ్‌ను అరెస్ట్ చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. అధికారిక అహంకారంతో వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ సర్కార్ పెద్దలు.. తగిన మూల్యం చెల్లించుకుంటారని ధ్వజమెత్తారు.
బండి సంజయ్‌ను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కమలం శ్రేణులు రాస్తారోకో, మానవ హారం నిర్వహించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం పక్కదారి పట్టించేందుకు సంజయ్‌ను నిర్బంధించారని నేతలు ఆరోపించారు. మెదక్‌లో బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. సంజయ్‌ను విడుదల చేసేంతవరకు ఉద్యమిస్తామని నినదించారు.
"తెలంగాణ ప్రజల ఆంకాంక్షను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కాల రాసింది. అందుకే ఇవాళ ఉద్యమాలు జరుగుతున్నాయి. నిజాం పాలననే తెలంగాణలో ఇంకా కొనసాగిస్తున్నారు. ఉద్యమాలను అణచివేసే కుట్రలో భాగంగా ఈరోజు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. సంజయ్ అరెస్టుతో తెలంగాణలో ఉద్యమాలు ఆగిపోవు.. మరిన్ని ఉద్యమాలు చేస్తాం.".- కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
"టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవాళ బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. ఎస్ఎస్సీ పేపర్ లీకేజీలో బండి సంజయ్ అంతా చేశారని సృష్టిస్తున్నారు. అధికార అహంకారంతో కేసీఆర్ ప్రభుత్వం వ్యహరిస్తోంది. దీనికి తగిన మూల్యం చెల్లించకుంటుంది".- డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
ఇవీ చదవండి:
పోలీసులకు 'బలగం' సినిమా చూపిస్తే బాగుండేదన్నారు: బండి సంజయ్ భార్య
హెబియస్ కార్పస్ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు నోటీసులు
'పది' పేపర్ లీకేజీ.. ప్రభుత్వం రాసిన స్క్రిప్టే: MLA రఘునందన్‌రావు