రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెరాస ప్రభుత్వం గుప్పిట్లో పెటుకుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రాజ్యాంగంపట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా... గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో వెంటనే కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గెజిట్ విడుదల చేయకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీ నూతన కార్పొరేటర్లతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో లక్ష్మణ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
కార్పొరేటర్లను కొనుగోలు చేయాలని చూస్తోంది
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎస్‌ఈసీ తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. దొడ్డిదారిన కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. తెరాస, ఎంఐఎం అవినీతిని కక్కించడానికి భాజపా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లను అవమానిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. కార్పొరేటర్లను కొనుగోలు చేయాలని తెరాస చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సురవరం అంటే గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక : మంత్రి కేటీఆర్