BJP Issues in Telangana Elections : బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెబుతూ వస్తున్న కమలనాథులు ఎన్నికలకు ముందే చతికిలపడిపోయారు. కీలక కమిటీల బాధ్యతలు తీసుకున్న నేతలు పార్టీ మారడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హస్తం గూటికి చేరారు. పోరాటాల కమిటీ ఛైర్మన్‌గా పార్టీ విజయశాంతికి బాధ్యతలు అప్పగించినప్పటికీ.. ఆమె పార్టీ కార్యకలాపాలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటిని కోఆర్డినేషన్ చేసుకునే బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పగించింది. కానీ ఆయనను త్రిపుర గవర్నర్‌గా నియమించడంతో ఆ సీటు కూడా ఖాళీ అయింది.
ఛైర్మన్లు లేకపోతే కన్వీనర్లు అయినా బాధ్యతలు తీసుకుంటారనుకుంటే వారు కూడా తమకెందుకులే అనే ధోరణిలో ఉండిపోయారు. మేనిఫెస్టో కమిటీకి జాయింట్ కన్వీనర్‌గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించింది. కానీ ఆయన కూడా పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో సముచిత గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ విజయశాంతికి పోరాటాల కమిటీ బాధ్యతలు అప్పగించినా.. ఆమె ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క నిరసన, ఆందోళన చేపట్టిన దాఖలాలు లేవు. నేతలు పార్టీ మారడంతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని నియమిస్తారా? లేక అలాగే ఎన్నికలకు వెళ్తారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Internal Issues Of BJP In Telangana Elections : ఎన్నికల సమయంలో ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఎంతో కీలకమైంది. పార్టీ గెలుపోటములను కూడా మేనిఫెస్టోనే నిర్ణయిస్తుంది. మేనిఫెస్టోను ప్రతి పార్టీ భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తుంటాయి. మేనిఫెస్టో కమిటీ బాధ్యతలు తీసుకున్న వివేక్ ఉన్నపళంగా పార్టీ మారారు. బీజేపీ మేనిఫెస్టోలో పొందు పరిచే అంశాలు దాదాపు వివేక్‌కు తెలుసు. ఇప్పుడీ అంశం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు. కీలక స్థానాలన్నీ పార్టీ మారిన నేతలకే ఇవ్వడంతో బీజేపీ చిట్టా మొత్తం వారి చేతుల్లో ఉంది. ఇది బీజేపీ భవిష్యత్‌ను ప్రమాదంలో నెట్టేసే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే జరిగితే కమలం పార్టీకి ఊహించని దెబ్బ పడినట్లే అవుతుందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
మేనిఫెస్టో కమిటీలో కో కన్వీనర్‌గా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కొనసాగుతున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల పోటీ చేస్తున్న ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మేనిఫెస్టో ఎలా రూపొందిస్తారనే అనుమానాలు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ ఉన్నాయి. పని విభజన చేసుకోవడంలో కమలనాథులు విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జితేందర్ రెడ్డి పాలమూరు నియోజకవర్గానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి తన తనయుడు మిథున్ రెడ్డి పోటీ చేస్తుండటంతో కుమారుడి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు బీజేపీకి ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
'తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే చంద్రబాబు పోటీకి దూరం'
ప్రపంచంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిపోనుంది : బీజేపీ నేతలు