NVSS Prabhakar on TRS : 2017-20 మధ్య దేశంలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు తెలంగాణ నుంచే జరిగాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని.. మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం గత ఎనిమిదేళ్లలో చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనే రైతులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులు సంతోషంగా ఉంటే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఏ ప్రధాని పెంచనంతగా పంటకు మద్దతు ధర పెంచిన ఘనత మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు.
బోగస్ ఓట్ల ఏరివేత కోసం కేంద్రం... ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ వంటి పాతనగరాల్లో ఆధార్ లింక్ చేస్తే ఎంఐఎంకే దెబ్బ అవుతుందన్నారు. రిగ్గింగ్ చేయాలనుకునే నేతలకు ఒక గుణపాఠం అవుతుందని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
'రైతుల విషయంలో కొంచెం మంచి పేరు ఉందని ఎక్కడోచోట అనుకుంటుంటే... నిన్నటి వీళ్ల చర్యలతో అదికూడా పోయిందని భావిస్తున్నాం. ఈ ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యమని భాజపా అభిప్రాయ పడుతోంది. భారతదేశంలోనే ఎక్కువ సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు జరిగింది తెలంగాణలోనే. పదే పదే రైతు బంధు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ చేశానని గొప్పలు చెప్పుకుంటుంటే... ఎందుకిన్ని బలవన్మరణాలు.. ఎందుకు ఇన్ని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా.' - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఇదీ చూడండి: Piyush Goyal on Cm kcr: 'ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు'