BJP Election Calendar In Telangana : కొత్త ఏడాదిలో రాజకీయవేడి పెంచేందుకు కమలనాథులు కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అనే నినాదంతో ముందుకుసాగనున్నారు. తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న.. బీజేపీ జాతీయ నాయకత్వం మిషన్-90 లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మిషన్ విజయవంతానికి నాలుగంచెల విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ప్రభారీ, కన్వీనర్, విస్తారక్‌లు ఉండగా.. ఇప్పుడు సరికొత్తగా పాలక్‌ల వ్యవస్థను ఏర్పాటుచేసింది.
రాష్ట్రంలోని119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీముఖ్యనేతలు, మాజీఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాలక్‌లను నియమించింది. ప్రభారీ, కన్వీనర్, పాలక్, విస్తారక్‌లు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా బూత్‌కమిటీల ఏర్పాటు, పనితీరు, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటి సమస్యల పరిష్కారానికి పోరాటాల రూపకల్పన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించనున్నారు.
సుమారు 7లక్షల మందితో వర్చువల్ సదస్సు: ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో బీజేపీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది. 10 నెలల రోడ్డు మ్యాప్‌లో భాగంగా.. 4 నెలలకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించారు. ఎన్నికల క్యాలెండర్‌లో భాగంగా జనవరి 7న.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌స్థాయిలో సదస్సులు నిర్వహించనుంది. 36,000 బూత్‌లలో.. సుమారు 7లక్షల మందితో సదస్సును నిర్వహించనుంది. వర్చువల్ వేదికగా జరిగే ఈ సదస్సులో కమలదళపతి జేపీ నడ్డా పాల్గొననున్నారు.
కనీసం 10 వేల వీధి సభలు: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బూత్‌స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం సహా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లేలా శ్రేణులకు.. నడ్డా దిశానిర్దేశం చేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. జనవరి 20నుంచి ఫిబ్రవరి 5వరకు గ్రామాల్లో తిరుగుతూ.. కనీసం 10 వేల వీధి సభలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు.. మార్చి చివరి వరకు ఉమ్మడి జిల్లాస్థాయిలో భారీ సభల నిర్వహణకు సిద్ధమవుతోంది.
నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు: ఫిబ్రవరిలో నిర్వహించనున్న బూత్‌కమిటీ సమ్మేళనానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పలువురు కేంద్రమంత్రులు.. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజాసమస్యలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పరిశీలిస్తున్నారు. మార్చిలోగా పార్లమెంట్ ప్రవాస్‌యోజన పూర్తిచేసి.. నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు జరపాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో రాష్ట్రప్రభుత్వంపై ఛార్జీషీట్ తయారుచేసి భారీ బహిరంగ సభ ద్వారా విడుదలకు ప్రణాళికలు రచిస్తోంది. ఆ సభకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా లేదా జేపీ నడ్డాను రప్పించేలా ప్లాన్ చేసింది.
ఇవీ చదవండి: కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో: ఎంపీ లక్ష్మణ్