Bandi Sanjay met Padma Shri awardees: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన 12 మెట్ల కిన్నెర వాద్యకారుడు దర్శనం మొగిలయ్య, సహస్ర అవధాని గరికపాటి నరసింహారావును.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలోని మొగిలయ్య నివాసానికి వెళ్లిన బండి సంజయ్.. ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మొగిలయ్య ఇంట్లో కూర్చుని దాదాపు అరగంటకు పైగా ఆయనతో ముచ్చటించారు.

స్వామీజీ ఆశీస్సులు
తనకు పద్మశ్రీ ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి మొగిలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బండి సంజయ్‌తో పాటు మొగిలయ్య ఇంటికి వెళ్లిన జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి.. ఆయనకు ఆశీస్సులు అందజేశారు.
స్వశక్తితోనే సాధ్యం
అనంతరం సైనిక్‌పురిలోని గరికపాటి నరసింహారావు నివాసానికి.. విరూపాక్ష స్వామితో కలిసి బండి సంజయ్ వెళ్లారు. గరికపాటిని ఘనంగా సన్మానించిన సంజయ్.. అనంతరం దంపతుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఎటువంటి పైరవీలు లేకుండా స్వశక్తితో కష్టపడి పనిచేస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయని గరికపాటి అన్నారు. గరికపాటి ప్రవచనాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.

ఇదీ చదవండి: Revanth Reddy Latest Comments: 'ఎమ్మెల్యేలకు వినతి పత్రాలిస్తే దాడులు చేస్తారా?'