BJP and TRS parties are playing drama: తెలంగాణలో ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నాటకాలడుతున్నాయని.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. ఎమ్మెల్యేల ఎర కేసులో ఒకరు, దిల్లీ మద్యం కుంభకోణంలో మరొకరు ఈ డ్రామాలను రక్తి కట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మీడియా కూడా ఈ రెండు మాత్రమే పట్టించుకుంటూ.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు సమస్యల గురించి కానీ, పెరిగిన ధరల గురించి కానీ, శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల గురించి కానీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ధరణి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని.. తనకే ఇబ్బంది కలిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. చివరికి పరిష్కారం కోసం వాళ్లు నక్సలైట్ల వద్దకు వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కూడా నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం అధికారులను విస్తరించాలని డిమాండ్ చేశారు. రబీ వ్యవసాయ ప్రణాళిక గురించి ఇప్పటి వరకు ఆ ఊసేలేదన్న ఆయన వ్యవసాయ రంగానికి ప్రతి ఏడాది ప్రణాళికలు ఉండేవని.. ఈసారి అవి కూడా లేవని మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా సమీక్షలు లేవని, పెట్రోల్ ధరలతో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా అనూహ్యంగా ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై సమీక్షలు లేకుండా చేశారని.. మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు జారీ చేసిన సీబీఐ అందరిని విచారణ జరిపినట్లే.. ఆమెను కూడా తమ కార్యాలయానికి పిలుపించుకొని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ భార్యభర్తల మాదిరిగా ఇంట్లో బాగానే ఉంటున్నారని ఆరోపించారు. ఆమె దోషి అయితే జైలుకు పోతుంది... లేకుంటే తిరిగి వస్తుంది... దాని వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చేది లేదు.. పోయేది లేదన్నారు.
"బీజేపీ వాళ్లకు వాళ్ల నీతులే వాళ్లకు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో లేరు. స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూ మహాసభ లేదు. కానీ ఇప్పుడు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మీద ఈడీ నోటీసు వస్తే ఎందుకు పోరు. ఎందుకు ధర్నాలు చేస్తున్నారన్నారు. బీ.ఎల్ సంతోష్ ఎవరు దేశభక్తుడా? స్వతంత్ర పోరాటంలో వాళ్ల కుటుంబం ఏమైనా పనిచేసిందా. అతనికి నోటీసులు రాగానే బీజేపీ వాళ్లు ఎందుకు పారిపోతున్నారు."- షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత
ఇవీ చదవండి: