బయోడైవర్సిటీ పై వంతెనపై వంపుల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. బయోడైవర్సిటీ కూడలి వంతెన తీరుపై నిపుణుల కమిటీ సోమవారం నివేదికను సమర్పించింది. వంతెనను ఇండియన్ రోడ్డు కాంగ్రెస్‌కు అనుగుణంగా నిర్మించినా వేగంగా వెళ్లే వాహనదారులకు ఇది సురక్షితంగా లేదని నిపుణుల కమిటీ తేల్చింది. ముందుగానే నిర్ణయించినట్లు ఈ వంతెనపై వాహనాలు గంటకు 40 కి.మీ. వేగంతో ప్రయాణించడానికి వీలుగా వేగ నిరోధకాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఈ వంతెన లోటుపాట్లపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ప్రపంచ బ్యాంకు రోడ్డు సేఫ్టీ విభాగం సలహాదారు ప్రొఫెసర్ నాగభూషణరావు, నిపుణులు డాక్టర్ టీఎస్ రెడ్డి, సహాయ ప్రొఫెసర్ శ్రీనివాస్‌కుమార్, ప్రదీప్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సోమవారం తన నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌కు సమర్పించింది. దీన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోనున్నారు.
* వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్సార్డీపీ) కింద కూడలిలో నిర్మించిన రెండోస్థాయి (రోడ్డు ఉపరితలానికి 16 మీటర్ల ఎత్తు) పైవంతెన నవంబరు 4న అందుబాటులోకి వచ్చింది.
* దీనిపై ఖాజాగూడ కూడలి నుంచి మైండ్‌స్పేస్ (వన్ వే) దిశలో వెళ్లే వాహనాలకు అనుమతి ఉంటుంది. నవంబరు 9న ఓ కారు వంతెనపై ఫొటోలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను ఢీకొట్టిన ఘటనలో వారిద్దరూ మరణించారు.
* అది మరువకముందే నవంబరు 23న రెండో ప్రమాదం చోటు చేసుకుంది. 104 కి.మీ. వేగంతో దూసుకొచ్చిన పోలో రేసుకారు మలుపు వద్ద వంతెన ప్రహరీని ఢీకొట్టి రోడ్డు మీదకు పల్టీ కొట్టింది. అ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. కారు నడిపిన వ్యక్తి మాత్రం గాయాలతో బయటపడ్డాడు.
* ఈ దుర్ఘటనతో వంతెన డిజైన్‌లో లోపాలున్నాయన్న దుమారం రేగింది. స్పందించిన జీహెచ్‌ఎంసీ.. నిపుణులతో కమిటీ వేసింది. పలుమార్లు వంతెనను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పైవంతెనపై జరిగిన ప్రమాదాన్ని ఆచరణాత్మకంగా (సీన్ రీ కన్‌స్ట్రక్షన్) పరిశీలించారు. ఇన్నోవా వాహనంలో పూర్తి రక్షణ చర్యలతో వంతెనపై ఒకసారి 60 కి.మీ వేగంతో, రెండోసారి 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లి ప్రమాదానికి కారణాలను అన్వేషించారు. వంతెన ఆకృతి, నాణ్యత, ఇతరత్రా అంశాలను పరిశీలించి నివేదిక ఇచ్చారు. ప్రారంభించిన 20 రోజుల్లో రెండు దారుణమైన రోడ్డు ప్రమాదాలకు దారితీసిన ఈ వంతెన విషయంలో ఇంజినీర్లు మరింత దూరదృష్టితో వ్యవహరిస్తే బాగుండేదని నిపుణులు కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇదే సమయంలో వంతెన ఆకృతి, కట్టడం నాణ్యత ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్‌సీ) ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని తేల్చారు. అయితే.. ఇంజినీర్లు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టడంపైనే దృష్టి పెట్టారని, రెండు ప్రాణాంతకమైన మలుపులతో తక్కువ పొడవున్న పైవంతెన ఎలాంటి దుష్పరిణామాలకు తావిస్తుందనే కోణంలో చర్యలు తీసుకోలేకపోయారని అంచనా వేసింది.
* వంతెన ప్రారంభం నుంచి మలుపుల వరకు వేర్వేరు చోట్ల, వేర్వేరు ఎత్తుల్లో వేగాన్ని నిరోధించే రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయాలని, సెల్ఫీలు తీసుకోకుండా మలుపు దగ్గర ప్రహరీ (క్రాష్ బారియర్స్)పై 1.5 మీటర్ల ఎత్తున పరదా లాంటి నిర్మాణం చేపట్టాలని సూచించింది. కమిటీ సూచించిన చర్యలు పూర్తయ్యాక మరోసారి నిపుణుల కమిటీ వంతెనను పరిశీలించనుంది. బల్దియా, ట్రాఫిక్ పోలీసులతో సమావేశమై పైవంతెనను తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు.
‘వంతెన పొడవు 990 మీటర్లు. అంత తక్కువ పొడవున్న వంతెన ‘ఎస్’ ఆకారంలో రెండుచోట్ల ప్రమాదకరంగా మలుపు తిరిగింది. ప్రమాణాల ప్రకారమే ఉన్నప్పటికీ అలాంటి ఆకృతి వాహనదారులకు శ్రేయస్కరం కాదు. భూసేకరణకు వెనకాడకుండా ఉంటే వంపులు తగ్గి ఉండేవి.’ అని నిపుణుల నివేదిక స్పష్టం చేసింది. ప్రమాదాలను నివారించాలంటే గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 40 కి.మీ.కు పరిమితం చేయాల్సిందేనని పేర్కొంది.
ఇదీ చూడండి: నేడు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్