రైతులు తమ ఉత్పత్తులు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే కాక దేశంలో ఎక్కడైనా విక్రయించేందుకు వీలు కల్పించేలా.. ప్రతిపాదించినది... ది ఫార్మర్స్ ట్రేడ్ అండ్ కామర్స్- ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్లు-2020. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించేందుకు ఉద్ధేశించినది. 'ది ఫార్మర్స్- ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్' బిల్లు.
అసాధారణ పరిస్థితుల్లో..
వీటితో పాటు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే.. కీలకమైన ఆహార పదార్థాలు చట్ట నియంత్రణలో ఉండేలా.. మిగతా సమయాల్లో ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా.. కేంద్రం ప్రతిపాదించినది.. ఎసెన్సియల్ కమాడిటీస్ అమెండ్‌మెంట్ బిల్లు. ఈ 3 బిల్లులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చింది కేంద్రం. వీటిని లోక్‌సభలో ప్రవేశపెట్టారు.. అమోద ముద్ర కూడా పడింది. కానీ, వీటిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.
సంస్కరణలే లక్ష్యంగా..
వ్యవసాయరంగంలో సంస్కరణలే లక్ష్యంగా ఈ బిల్లులు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఇప్పుడు 2 బిల్లులకు ఆమోదముద్ర పడగా... అంతకుముందే వ్యవసాయ రంగానికి సంబంధించి నిత్యావసర వస్తువుల సవరణ చట్టానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ బిల్లులు ఎగువ సభకు వెళతాయి. అయితే వాటికి సంబంధించి కేంద్రం ఇప్పటికే ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. ప్రస్తుతం వాటి స్థానంలోనే ఈ 3 బిల్లులను తెచ్చింది.
ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు..
ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాక.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తుంది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంటోంది కేంద్రం. దీని ప్రకారం మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులు అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించకూడదు. రైతులు కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. ఆ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏపీఎంసీల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి.
నిబంధనలు అడ్డురావు..
వ్యవసాయోత్పత్తులను స్థానిక, నిర్ణీత వ్యవసాయ మార్కెట్లలోనే కాక వెలుపలికి కూడా తరలించి అమ్ముకోవడానికి వీలు కల్పించే ఈ బిల్లు. వ్యవసాయదారులకు వరం లాంటిదంటోంది కేంద్రం. అంతర్రాష్ట్ర వర్తకానికి, వ్యవసాయోత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి గానీ నిబంధనలు అడ్డు రావు. నిర్ణీత మార్కెట్లకు వెలుపల జరిగే వర్తకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల కు పన్నులు కట్టక్కరలేదు. అదే సమయంలో ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలూ కొనసాగుతాయని తెలిపింది. మార్కెట్లకు వెలుపల కూడా రైతులు ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలి అన్నదే ఈ బిల్లు ఉద్దేశమంటోంది కేంద్రం. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండవు. ఈ –ట్రేడింగ్‌కు కూడా అవకాశం ఉంటుంది.
బిల్లులో ప్రతిపాదనలు..
ఇక పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై.. వ్యాపారులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు రక్షణ కల్పించేలా... ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించిన ఈ బిల్లులో.. వ్యవసాయ ఉత్పత్తిని కొనేవారికి, రైతుకు మధ్య జరిగే వర్తక ఒప్పందాల చట్రాన్ని ఈ బిల్లు సూచిస్తున్నదని, ఇది రైతుకు న్యాయమైన ధర ఇప్పించేందుకు ఉపయోగపడేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లుల ప్రకారం రైతులు తమ పంట ఉత్పత్తులను.. దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా నచ్చిన ధరకు ఒప్పందం చేసుకునే అవకాశం లభిస్తుంది. రైతులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. అదే సమయంలో.. పంట ఉత్పత్తుల విక్రయం కోసం మార్కెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనిద్వారా రైతులు నేరుగా ఇళ్ల నుంచే ఆహారసంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, రైతు సహకా ర సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలు అమ్మవచ్చు.
కేంద్ర కేబినెట్ ఆమోదం..
ఎసెన్షియల్ కమాడిటీస్ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు గతంలోనే.. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల చట్టం సవరణలకు లోక్‌సభలోనూ ఆమోదముద్ర పడింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పులు, తృణ ధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణ ప్రతిపాదించారు. చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరవు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు.
నిల్వ పరిమితి ఉండదు..
అలాగే, ఆహారశుద్ధి, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిల్వ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ వస్తాయని పేర్కొంది .వ్యవసాయోత్పత్తుల ధర పెంపునకు, నిల్వ పరిమితికి మధ్య లంకె పెట్టింది. ఇది పెద్ద పెద్ద రైతులు తమ ఉత్పత్తిని భారీగా నిల్వచేసుకోవడానికి చట్టబద్ధత కల్పిస్తోందని, రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయ, మార్కెట్ రంగాలలో కేంద్రం.. తమ హక్కులను హరిస్తుందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
మార్కెట్‌కు అనుసంధానం..
ఈ 3 బిల్లులూ.. వ్యవసాయరంగాన్ని మార్కెట్‌కు అనుసంధానం చేయడంలో భాగంగానే తీసుకొచ్చారు. అయితే, బిల్లుల వల్ల రైతులు కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లోకి వెళ్తారని, వ్యవసాయ ఉత్పత్తుల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుందని, ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయరంగం పూర్తిగా కేంద్రం పెత్తనం కిందికి వెళ్తుందని.. రాష్ర్టాలకు అధికారాలుండవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అనేక వివాదాస్పద నిర్ణయాలను చట్టబద్ధం చేయాలన్న పథకంలో భాగంగానే ఈ మూడు బిల్లులను తీసుకువచ్చారని విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచే కాకుండా ఎన్డీఏ మిత్రపక్షం నుంచే గట్టి ప్రతిఘటన ఎదురయింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ మంత్రి పదవికి రాజీనామా చేయటం సంచలనమైంది.
ఇదీ చూడండి: 'జీవో ఉల్లంఘించిన 55 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు'