Nitish kumar comments on BRS meeting : ఎన్డీయేతర పక్షాలతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశం గురించి తనకు సమాచారం లేదన్న నీతీశ్ కుమార్.. ఆహ్వానం అందినా ‘సావధాన్ యాత్ర’, రాష్ట్ర (బిహార్) బడ్జెట్‌కు సంబంధించిన సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ఆ సభకు హాజరుకాలేక పోయేవాణ్ని అని పేర్కొన్నారు.
బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఒకే వేదికపై రావాలని కోరుకుంటున్న నీతీశ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం పట్నాలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వప్రయోజనాలకోసం ఏమీ కోరుకోవడం లేదు. జాతి ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగితే చూడాలని ఉంది. తెలంగాణలో జరిగింది బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సభ మాత్రమే. కొత్తకూటమి ఏర్పాటుకోసం నిర్వహించిన సభగా దీన్ని చూడకూడదు. ఆహ్వానం అందుకున్న వారు ఆ సమావేశానికి హాజరయ్యారు’’ అని నీతీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
విజయవంతమైన బీఆర్‌ఎస్ సభ.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా ఆవిర్భవించిన అనంతరం ఖమ్మంలో తొలిసారి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు. జాతీయ నాయకుల సమక్షంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంచి స్పందన లభించింది.
సభకు సీపీఐ, సీపీఎం, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన అగ్రస్థాయి నాయకులను రప్పించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముందడుగు వేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే వేదికపై నలుగురు సీఎంలు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి ఆసీనులవ్వడం సభకు ప్రధాన ఆకర్షణగా మారింది. బీజేపీని బలంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు, సీఎంలను ఒకే వేదికపైకి చేర్చడం ద్వారా కేసీఆర్ విజయవంతమయ్యారు. కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఈ బహిరంగ సభ ద్వారా తొలి అడుగు పడినట్లయింది.
ఇవీ చదవండి: