Bhatti Vikramarka: దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సమాజంలో అట్టడుగు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా విప్లవాత్మక సామాజిక మార్పునకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన సేవలు యావత్ తెలుగు జాతికే గర్వకారణని కొనియాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల ఫొటోలు లేకుండా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను చేయడమేంటని భట్టి విక్రమార్క విమర్శించారు. అమృత్ మహోత్సవాల్లో దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫొటో లేకపోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్రం వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రదర్శన చేపట్టిన యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా జూన్ 12న ఆర్ఆర్బీ, టెట్ పరీక్షలు రెండూ ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వాయిదా వేయాలని వినతి పత్రం అందించడానికి మంత్రి సబిత ఇంటికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని భట్టి ఆరోపించారు.
'గాంధీ, నెహ్రూ లేకుండా స్వాతంత్య్ర సంగ్రామం లేదు. ప్రతి దశలోనూ వారి పోరాటం ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో నెహ్రూ ఫొటో లేకపోవడం బాధాకరం. బ్రిటిషు వాళ్ల అడుగులకు మడుగులొత్తిన సావర్కర్ లాంటి వ్యక్తుల ఫొటోలు పెట్టడం దుర్మార్గం. ఇదేనా మీరు వారికిచ్చే గౌరవం. తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన చరిత్ర మారదు. చదువుకోని వారు ప్రధానులయితే ఇలాగే చరిత్రను వక్రీకరిస్తారు.' -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇవీ చదవండి: 'ఒక అభిమాని పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తా...'
చీరకట్టులోనే వరద ప్రాంతాల్లో పర్యటన.. కలెక్టర్‌పై ప్రశంసల వెల్లువ