దిల్‌సుఖ్‌నగర్ శ్రీకృష్ణానగర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి గుండెగోని బాలాగౌడ్. ఈయన మిద్దె సాగులో వినూత్న పంథాకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు జీ+ టెర్రస్ లేదా బాల్కనీలో ఇంటి పంటలను సాగు చేస్తుండటం చూశాం..కానీ బాలాగౌడ్ మాత్రం గత ఏడాది కర్మన్‌ఘాట్ లో నిర్మించిన 3500 చదరపు అడుగుల గత సువిశాల వాణిజ్య సముదాయంపై "మన ఇల్లు-మన మిద్దె తోట" పేరిట సేద్యం చేపట్టారు.దీనికి "శ్రీరాఘవేంద్ర ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్" అని నామకరణ చేశారు.
తమ కోసమే కాకుండా జంట నగరవాసుల సందర్శనార్ధం దీనిని తీర్చిదిద్దారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులుకు ప్రత్యామ్నాయంగా జీవామృతం, వేపనూనె, ఘన జీవామృతం, ఇతర ప్రకృతి ఎరువులను వినియోగిస్తూ అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ఔషధ, సుగంధ పంటలు సాగు చేస్తున్నారు.
కార్పోరేట్ తరహాలో దశల వారీగా 6 లక్షల రూపాయల వరకు వెచ్చించి ఐదంతస్తులపైన "మన ఇల్లు - మన మిద్దెతోట"ను అందంగా తీర్చిదిద్దారు బాలాగౌడ్ . మొదట సూక్ష్మ సేద్య విధానాలతో, ప్లాస్టిక్ బకెట్లు, కోకోపీట్ ఉపయోగించి విత్తనాలు, మొక్కలు, అంట్లు నాటారు. ఎక్కడా చుక్క నీరు వృధా కాకుండా పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో... ప్రతి బొట్టు సద్వినియోగం చేసుకుంటూ 25 రకాలకు పైగా కూరగాయలు సాగు చేస్తున్నారు.
పాలకూర, గోంగూర, బచ్చలికూర, తోటకూర, కొత్తిమీర లాంటి 15 రకాల ఆకుకూరలను పెంచుతున్నారు.ఈ మిద్దెతోటలో పెరుగుతున్న 30 రకాలకు పైగా పండ్ల మొక్కలు మంచి ఫలాలు ఇస్తున్నాయి. బంతి, చేమంతి, గులాబీ, మల్లె, లిల్లీ, కనకాంబరం వంటి 40కి పైగా రకాల పూలు పరిమళాన్ని వెదజల్లుతున్నాయి.
బతుకమ్మ పేర్చడంలో ఉపయోగించే సీతమ్మ జడకుచ్చులు ఈ మొద్దెతోటలో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితో పాటే సుగంధ, ఔషధ మొక్కలకు పెంచుతూ చక్కటి మానసిక ఆనందాన్ని పొందుతున్నారు- బాలాగౌడ్ కుటుంబ సభ్యులు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షల సమయంలోనూ కూరగాయలు, పండ్ల కోసం తాము బయటకి వెళ్లనేలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
సేంద్రీయ మిద్దెతోటలో చేపలను కూడా పెంచుతూ జీవవైవిధ్యానికి చిరునామాగా మార్చారు . 1000 లీటర్ల నీటి సామర్థ్యంగల రెండు ట్యాంకులు ఏర్పాటు చేసి... వాటిల్లో పిల్లలు వేసి పెంచుతుండటం ప్రత్యేకత సంతరించుకుంది. అదే నీటిని రీసైక్లింగ్‌చేసి వినియోగిస్తూ మంచి పంటలు తీస్తుండటం విశేషం.
ఇప్పటికే జంట నగరాల్లో లక్షల సంఖ్యలో డాబాలపై భారీ విస్తీర్ణం ఉంది. అదే అన్ని డాబాలు, బహుళ అంతస్తుల భవనాలు, బాల్కనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉత్పత్తి చేసినట్లైతే... తెలంగాణ మొత్తానికి సరఫరా చేయవచ్చని బాలాగౌడ్ అంటారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను సులభంగా అధిగమించాలంటే ప్రతి ఒక్క ఇంటి యజమాని మిద్దెతోటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. ప్రతి రోజూ కాస్తంత సమయాన్ని మిద్దెతోటలో గడిపితే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు పొందడటం సహా మానసిక ఉల్లాసం, ఆనందం సొంతం చేసుకోవచ్చు. అందుకు బాలాగౌడ్... కుటుంబమే ప్రత్యక్ష ఉదాహరణ.
ఇవీచూడండి: మైనర్పై దాష్టీకం: మత్తు మందు కలిపి అత్యాచారం... భార్య సహకారం