ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సామాజిక మాధ్యమాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.8 లక్షలు సైబర్ కేటుగాళ్లు వసూలు చేశారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఆ ముగ్గురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన నవీన్ అలియాస్ ప్రవీణ్, కృష్ణ జిల్లాకి చెందిన శివకుమార్ అలియాస్ రవి కిరణ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని మోసాలు బయటపడతాయని సీసీస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి : గ్రామీణ తెలంగాణలో... ఇన్నోవేషన్ యాత్ర