96, 88, 72 సిరీస్‌లతో మొదలయ్యే నంబర్లు ప్రమాదకరం. రాజస్థాన్ కేంద్రంగా సైబర్ నేరస్థులు మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని పలు ప్రకటనలను పెడుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లో ప్రజలను మోసం చేసి నెలకు రూ.15 కోట్లు కొట్టేస్తున్నారని వివరిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వీరు భారీగా సిమ్‌కార్డులు సమకూర్చుకుని వందలమందికి ఫోన్లు చేస్తున్నారని, వాటికి స్పందించవద్దని సూచించారు. నిందితులు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో తెలుసుకునేందుకు గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌లు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకుంటే మోసాలు తగ్గే అవకాశాలున్నాయని తెలిపారు
వందలాది సిమ్‌కార్డులు కొని..
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతంలో ఉంటున్న సైబర్ నేరస్థులు కొద్దినెలల నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్ సిమ్ కార్డులున్న ఫోన్ల ద్వారా బాధితులతో మాట్లాడితే పోలీసులు పట్టుకుంటారని తప్పుదోవ పట్టించేందుకు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు. అసోం, పశ్చిమబంగ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో వందల సంఖ్యలో సిమ్‌కార్డులను కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో సిమ్‌కార్డుల విక్రయాలు తక్కువగా ఉండడంతో కొందరు ఏజెంట్లు అమ్మకాలు పెంచుకునేందుకు సైబర్ నేరస్థులకు సిమ్ కార్డులను విక్రయిస్తున్నారు.
వీటి ద్వారా బాధితులతో మాట్లాడి రూ.లక్షలు వారి ఖాతాల్లోకి జమ చేయించుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కాల్ రికార్డులు చూస్తే.. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలు, పట్టణాల్లో నిందితులున్నారన్న సమాచారం వస్తోంది. సైబర్ నేరస్థులు తమ దృష్టి మళ్లించేందుకు ఇలా చేస్తున్నారని, గతంలో మధ్యప్రదేశ్ నుంచి సిమ్‌కార్డులు సమకూర్చుకుంటుడగా.. పదివేల సిమ్ కార్డులు బ్లాక్ చేయించామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. వీరికి సిమ్ కార్డులు సమకూర్చుతున్న నెట్‌వర్క్ సంస్థలపై చర్యలు చేపట్టాల్సిందిగా టెలికాంశాఖ ఉన్నతాధికారులను అభ్యర్థించామని తెలిపారు.
లోకల్ నెంబర్లతో..
ద్విచక్రవాహనాలు, కార్లను విక్రయించేందుకు సైబర్ నేరస్థులు స్థానిక వాహనాల ఫొటోలను ఓఎల్‌ఎక్స్ మొబైల్ యాప్‌లో ఉంచుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉంటున్న వారిని మోసం చేయాలంటే టీఎస్ రిజిస్ట్రేషన్, బెంగుళూరు వాసులకైతే ‘కేఏ’ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల ఫొటోలను యాప్‌లో పెడుతున్నారు. సంబంధిత వాహనాల ధ్రువపత్రాలను నకిలీవి తయారు చేస్తున్నారు. ప్రకటనలు చూసి స్పందించిన వారికి ఆ ధ్రువపత్రాలను పంపుతున్నారు. క్వికర్ డాట్‌కాం, సెకెండ్‌హ్యాండ్ వెహికల్స్ సేల్స్ వెబ్‌సైట్లలోని వాహనాల చిత్రాలను కాపీ చేసి ఓఎల్‌ఎక్స్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో పెడుతున్నారు.
ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్