చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం మిలిటెంట్ తరహా పోరాటాలు చేసేందుకు బీసీలు సిద్ధం కావాలని... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదని... తమ హక్కులను సాధించుకునే దిశగా బీసీలు ఐక్యం కావాలన్నారు. హైదరాబాద్ నారాయణ గూడలోని బీసీ సంఘాలతో సమావేశమయ్యారు.
జులై చివరి వారంలో..
74 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో బీసీ బిల్లు, బీసీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లు, రిజర్వేషన్ల అమలు, ప్రేవేట్ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... చలో దిల్లీకి పూనకున్నారు. జులై చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మందితో పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అదే విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి బిల్లు అమలు చేసే విధంగా ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
"బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం తరపున అన్ని రకాల రాజకీయ పార్టీలను కలిశాం. అయినా కూడా వారు పట్టించుకోలేదు. డిమాండ్ల పరిష్కారం కోసం ఎక్కని మెట్టు లేదు. కలవని పార్టీ లేదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రకరకాలుగా బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. అందుకోసమే జులై చివరి వారంలో వేల మందితో చలో దిల్లీ పేరుతో పార్లమెంట్ ముట్టడిని చేపడుతున్నాం. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మందితో పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. గతంలో పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెడితే.. భాజపా తప్ప అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. ఇప్పుడైనా బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకపోతే భాజపా బీసీ వ్యతిరేక పార్టీగా ముద్ర పడుతుంది. చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టకపోతే దేశ వ్యాప్తంగా భాజపా కార్యాలయాల ముందు నిరసన చేపడతామని హెచ్చరిస్తున్నాం".
- ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ఇదీ చూడండి: CM KCR : కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం