హైదరాబాద్‌లో ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నట్లు బత్తిన సోదరులు తెలిపారు. ఈసారి చేప మందు కోసం ఎవరూ రావద్దని బత్తిన హరినాథ్ గౌడ్ స్పష్టం చేశారు. చేప మందు ఇస్తామని ఎవరైనా ప్రకటిస్తే నమ్మవద్దని హరనాథ్ కోరారు.
ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధుల కోసం ప్రతి ఏడాది అందించే చేప ప్రసాదం పంపిణీ ఈ ఏడాది నిర్వహించడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. ఏటా మృగశిర కార్తె రోజు వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరం పంపిణీ చేయడం లేదన్నారు. కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తోన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కరోనా విజృంభణ వల్లే...
కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడం సహా రవాణ సౌకర్యాలతో పాటు అన్ని స్థంభించిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. చేప ప్రసాదం కోసం.. ఏటా దేశ విదేశాల నుంచి వేలాదిగా హైదరాబాద్ వస్తుంటారు. ఈ సంవత్సరం మాత్రం చేప ప్రసాదం కోసం ఎవరూ రావొద్దని బత్తిని హరినాథ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 29తో ముగిసిన అనంతరం పరిస్థితులను బట్టి జూన్‌లో పొడిగించినా తాము మాత్రం ఈసారి చేప ప్రసాదం పంపిణీ చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పేరుతో ఎవరైనా చేప మందు ఇస్తామని ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కోరారు. తక్షణం తమకు గానీ పోలీసులకు గాని తెలియచేయాలన్నారు.
మాకు సీఎం కేసీఆర్ సహా అందరూ...
ఏటా అందించే చేప ప్రసాదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అన్ని శాఖలు తమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేవని హరినాథ్ తెలిపారు. కార్యక్రమానికి ఇతర స్వచ్ఛంద సంస్థలు బద్రివిషాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్, అగ్రవాల్ సేవా సంగ్ సభ్యులు అందించే సహకారంతో చేప ప్రసాదం పంపిణీ చేసేవారమన్నారు. ఈ ఏడాది చేప ప్రసాదం కోసం ఎవరూ రావొద్దని స్పష్టం చేశారు.
నివారణే మార్గం !
కరోనా వైరస్‌కు ఏలాంటి మందు లేదని... ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. పరిశుభ్రత పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే రక్షణ అని హరినాథ్ గౌడ్ వివరించారు.