రాష్ట్ర సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ ఉత్సవాలు చివరిరోజు కన్నులపండుగగా జరిగాయి. సద్దుల బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తాయి. ఉయ్యాల పాటలు, బతుకమ్మ ఆటలతో మహిళలు రెట్టింపు ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు మహిళలతో కలిసి నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.
భాగ్యనగరంలో బతుకమ్మ...
జంటనగరాల్లో బతుకమ్మ సంబురాలు వైభవోపేతంగా సాగాయి. గల్లీగల్లీలోనూ ఆడపడుచులు సద్దుల వేడుకలు సందడిగా జరిగాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో నిర్వహించిన వేడుకలు అంబరన్నంటాయి. కుల, మతాలకు అతీతంగా మహిళలు తరలివచ్చారు. తీరొక్క పూలతో పేర్చిన 30 అడుగులు బతుకమ్మ శకటానికి సీఎం సతీమణి శోభ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో జానపద కళాకారుల ఆటపాటల నడుమ ఊరేగింపు వేడుకలు నేత్రపర్వంగా సాగాయి.
వర్షంలోనూ... వేడుకలు...
హన్మకొండలో పద్మాక్షిగుండం మహిళలతో కిటికిటలాడింది. తోర్రూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మహిళలతో కలిసి ఆడిపాడారు. ములుగులో ఎమ్మెల్యే సీతక్క మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. నారాయణగిరి వేడుకల్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. వర్షం అంతరాయం కలిగించినా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో జరిగిన వేడుకల్లో ఎంపీ కవిత మహిళలతో కలిసి చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. హన్మకొండ, పరకాలలో సంబురాలు వైభవంగా జరిగాయి. డోర్నకల్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్, జడ్పీ ఛైర్ పర్సన్ బిందు పాల్గొన్నారు. ఎడ్లబండిపై ఊరేగిస్తూ బతుకమ్మ ఘాట్‌కు తీసుకెళ్లారు.
ఆకట్టుకున్న నృత్యాలు...
హుజూరాబాద్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని... మహిళలతో కలిసి ఆడిపాడారు. కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. సిద్దిపేటలో కోమటి చెరువు వద్ద సంబురాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గంగమ్మ ఒడికి బతుకమ్మను చేర్చారు. జగిత్యాలలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ ఛైర్మన్ రాజేశంగౌడ్ మహిళలతో కలిసి కోలాటాలు ఆడారు. కరీంనగర్‌లో వర్షంలో గౌరమ్మను తడవనీయకుండా మహిళలు పరదా పట్టుకుని బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సద్దుల సంబరాలు ఘనంగా నిర్వహించారు.
వెళ్లి మళ్లీ రావమ్మా...
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన సంబురాల్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. జుక్కల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే హన్మంత్ షిండే మహిళలతో కలిసి ఆడిపాడారు. మంచిర్యాలలో జరిగిన సంబురాల్లో మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వేడుకల్లో గౌరమ్మను మళ్లీరావమ్మ అంటూ గంగమ్మ ఒడికి సాగనంపారు.
ఇవీ చూడండి: సడలని సర్కార్... మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె