బ్యాంకింగ్ రంగంలో సంక్షోభాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకుల విలీనాన్ని ప్రతిపాదించింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 పెద్ద బ్యాంకులుగా మార్చింది. పెద్ద బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు మంచి చేస్తాయని ప్రకటించింది. మొత్తంగా బ్యాంకులు కోలుకుంటాయని తెలిపింది.
నిరర్ధక ఆస్తులు…
నిరర్ధక ఆస్తులు.. కొంతకాలం క్రితం తీవ్ర చర్చకు దారి తీసిన అంశం… ఇవి తగ్గినట్లు ప్రభుత్వం చెబుతోంది. గణాంకాలు కూడా దీన్నే ధృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలు మళ్లీ మొండి బాకీలు బారిన పడే పరిస్థితి ఉందని నిపుణులు అంటున్నారు. లిస్టయిన కంపెనీలు కూడా నికర విలువ కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి.
చిన్న తరహా పరిశ్రమలకు రుణాలందించటం కోసం ఉద్దేశించిన పథకం ముద్ర. ఈ రుణాల్లో ఎక్కువ శాతం తిరిగి చెల్లింపు జరగట్లేదు. రఘరాం రాజన్ కూడా ముద్రా రుణాల్లో నిరర్ధక ఆస్తులపై ఇంతకు ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రుణాల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలని రిజర్వు బ్యాంకు ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు సూచించింది.
ఎన్బీఎఫ్ సీల…
నిరర్ధక ఆస్తులతో బాధపడుతున్న బ్యాంకులను ఆదుకునేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కొన్ని నెలల కిందట మూలధనాన్ని అందించాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతున్న దృష్ట్యా ఈసారి మూలధన మద్దతు అందించకపోవచ్చని తెలుస్తోంది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నాయి. వీటికి సంబంధించి బడ్జెట్ లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ రంగం సంక్షోభానికి ప్రైవేటీకరణ సమాధానమని ప్రభుత్వం భావిస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే దీనివల్ల సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రైవేటు బ్యాంకులపై నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతున్న వేళ...ప్రభుత్వం జాతీయికరణ చేసిందని వారు గుర్తుచేస్తున్నారు.
ఫైనాన్సియల్ రిసోల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖాతాదారులకు బ్యాంకులో చేసిన జమకు కల్పించే బీమాను పెంచనున్నట్లు సమాచారం. దీని ద్వారా సహాకార బ్యాంకులను కూడా నియంత్రించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: ప్లాస్టిక్ నుంచి పేపర్ సంచికి మారుదాం...