BJP Nirudyoga March in Sangareddy : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించే బీజేపీ నిరుద్యోగ మార్చ్‌కు కాషాయ సైనికులంతా కదలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నిరుద్యోగ మార్చ్‌తో సీఎం కేసీఆర్ కుటుంబానికి ఓ గుణపాఠం కావాలని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లా పోలింగ్ బూత్ కార్యకర్తలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉమ్మడి 10 జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ ద్వారా నిరుద్యోగులకు అండగా నిలవాలన్నదే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. గత నెలలో ఉమ్మడి వరంగల్, పాలమూరు జిల్లాలో నిరుద్యోగ మార్చ్‌కు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి విజయవంతం చేశారని గుర్తు చేసిన ఆయన.. ఆ అంశం దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. నిరుద్యోగ మార్చ్ ద్వారా కేసీఆర్ నిరంకుశ, నియంత విధానాలపై గర్జించి గాండ్రించాలని యువతకు పిలుపునిచ్చారు.
Nirudyoga March in Sangareddy : సీఎం కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదమేర్పడిందని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా యువత బతుకులు అథోఃగతి పాలవుతున్నా సీఎం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
నిరుద్యోగ మార్చ్‌లో ఆ రెండు అంశాలే ప్రధానం: తూతూ మంత్రంగా కొద్దిమందిని అరెస్ట్ చేసి పేపర్ లీకేజీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బండి ఆరోపించారు. సిట్ దర్యాప్తు నిందితులకు కొమ్ముకాయడానికే పనిచేస్తోందే తప్ప.. నివేదిక ఇచ్చిన దాఖలాల్లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌తోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. బీజేపీ చేస్తున్న ఉద్యమాలను గమనిస్తున్నారని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే సత్తా బీజేపీకే ఉందని ప్రజలు భావిస్తున్నట్ల ధీమా వ్యక్తం చేశారు. ఆయా జిల్లాలకు ధీటుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని సూచించిన ఆయన.. ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ అడ్డా కావాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి టి.వీరేందర్ గౌడ్, ఆకుల విజయ, దరువు ఎల్లన్న, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: