Bandi Sanjay Letter to CM KCR : నిరుద్యోగ యువత భవిష్యత్తును తాకట్టు కేసీఆర్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన భూమిని ఈద్గా ప్రార్థనల కోసం కేటాయించడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Bandi Sanjay Letter to CM KCR News : నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించొద్దని ఆనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కానీ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా చించోలిలో ఈద్గాను నిర్మించడం న్యాయ వ్యవస్థను అవమానించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అవుతుందని అన్నారు.
హిందూ దేవాలయాల సమీపంలోనే ఈద్గా ప్రార్థనలకు భూమిని కేటాయించడం.. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకేనని భావించాల్సి వస్తోందని బండి సంజయ్ అన్నారు. ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం బీఆర్ఎస్ స్వార్థ రాజకీయలకు పరాకాష్ట అని విమర్శలు గుప్పించారు. చట్ట విరుద్ధమైన భూమిలో నిర్మాణ ప్రారంభానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెళ్తుండడం బాధాకరంగా ఉందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును బలి చేసే చర్యలను బీజేపీ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోందని బండి సంజయ్ లేఖలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులను బేఖాతరు చేసి.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విరుచుకుపడ్డారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అవార్డులు కేసీఆర్ పనితీరుకు ఇచ్చినవి కాదని అన్నారు. ఈ అవార్డులు సర్పంచ్, స్థానిక అధికారి పనితీరుకు ఇచ్చినవని వివరించారు. ఇందుకు సంబంధించిన అవార్డులు అనేక రాష్ట్రాలకు వచ్చాయని తెలిపారు. రాష్ట్రానికి ఎక్కువ అవార్డులు వచ్చిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఏ అవార్డు దేనికి వచ్చిందో కూడా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: