దేశంలో విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కొవిడ్ బాధితుల కోసం యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడానికి చొరవ చూపిన ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే, ఉపరితల రవాణా, పౌర విమానయాన, రక్షణ మంత్రిత్వ శాఖల సమన్వయంతో అన్ని ప్రాంతాలకు వెంటనే మెడికల్ ఆక్సిజన్‌ను అందించేందుకు మోదీ సర్కారు కార్యాచరణ రూపొందించిందని చెప్పారు.
ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయని బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి చేరుకోనుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమైన తెరాస సర్కారు కేంద్రాన్ని విమర్శించడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
ఇదీ చదవండి: 'గిట్టుబాటు ధరలే లేవంటే... ఈ కమీషన్ ఏజెంట్ల మోత ఒకటి'