అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకునేందుకు తెరాస.. అధికారమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్ పనిచేస్తున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమేనని చెప్పుకుంటున్న ఆ పార్టీ నాయకులు దుబ్బాక, బల్దియా ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్న కాషాయదళం.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. కేసీఆర్ అవినీతి కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు భాజపా ప్రకటించింది.
ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ తిరిగి 2004లో అధికారంలోకి వచ్చిందని భాజపా నేతలు భావిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కమలనాథులు భావిస్తున్నారు. భాజపా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యోచిస్తోంది. బండి సంజయ్ నేతృత్వంలో జరిగే తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభం కానుంది. హుజూరాబాద్ వరకు సాగే పాదయాత్ర కోసం ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు.
రూట్ మ్యాప్ సిద్ధం
పాదయాత్రలో భాగంగా జనసమీకరణ, ప్రచారం, బస, సభలు, ప్రోటోకాల్, సోషల్ మీడియా, లీగల్ సెల్, రూట్ మ్యాప్‌కు సంబంధించి మొత్తం 29 కమిటీలను నియమించారు. ఈ కమిటీల్లో మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను భాగస్వామ్యం చేశారు. సెప్టెంబర్ 17న హుజూరాబాద్ గడ్డపై భారీ బహిరంగ సభతో తొలి విడత పాదయాత్ర ముగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకావాలని రాష్ట్ర నాయకత్వం కోరింది.
యాత్ర షెడ్యూల్
ప్రజా సంగ్రామ యాత్ర కోసం ఇప్పటికే సంగారెడ్డి వరకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ నెల 24న చార్మినార్ వద్ద పాదయాత్ర ప్రారంభమై నాంపల్లి, మెహదీపట్నం మీదుగా షేక్‌పేటకు చేరుకుని రాత్రి బస అక్కడే చేస్తుంది. రెండో రోజు పాదయాత్ర గోల్కొండ వద్ద జరిగే సభతో ప్రారంభమై రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఈ లోపు హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తే దాని ప్రకారం సంగారెడ్డి నుంచి పాదయాత్ర రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నియమావళిని బట్టి పాదయాత్ర పరిధిని పెంచుకుంటూపోవడం లేదా తగ్గించుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. పాదయాత్రకు సంఘీభావంగా కేంద్రమంత్రులతో పాటు పార్టీ జాతీయ నాయకులు హాజరై రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయిలో ఎండగడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. 2023 ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర దశల వారీగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజా క్షేత్రంలో తెరాస వైఫల్యాలను ఎండగట్టి 2023లో భాజపాను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కమలనాథులు. భాజపా పాదయాత్ర వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
ఇదీ చదవండి: Kishan reddy: కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర.. కోదాడ టు హైదరాబాద్