Bandi Sanjay Padayatra Video Presentation: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై, ప్రధాని మోదీ ఇటీవల ప్రశంసల జల్లులు కురిపించినట్లు కమలనాథులు తెలిపారు. ఇటీవల దిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన ఎంపీలను పిలిపించుకుని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజాసంగ్రామ యాత్రకు సంబంధించిన అంశాలపై మోదీ ఆరా తీశారు.
తాజాగా ఆయన స్వయంగా సంజయ్‌కి ఫోన్ చేసి ప్రశంసలు కురిపించారని.. తెలుస్తోంది. మోదీతోపాటు నడ్డా, అమిత్‌షా సంజయ్ యాత్రను ప్రశంసించారు. రేపు జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాదయాత్రపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశాలను బీజేపీ ఎంపీలకు వివరించి.. దక్షిణాధి రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర చేపట్టడంపై దిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకోనున్నారు.
బండి సంజయ్ యాత్రకు వస్తున్న ఆదరణ ఆధారంగా, దక్షిణాది రాష్ట్రాల్లో పాదయాత్రలకు రోడ్డు మ్యాప్ ఖరారు చేయాలని జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేతలతో తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై.. వేటు తప్పదని రాష్ట్ర నాయకత్వం సంకేతాలిచ్చింది.
వారికి షోకాజ్ నోటీసులు ఖాయమని.. ఇటీవల నిర్వహించిన పదాధికారుల సమావేశంలో స్పష్టం చేసింది. దీనిపై జాతీయ నాయకత్వం కూడా దృష్టిసారిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దాదాపు 8 నుంచి 10 మంది జిల్లా అధ్యక్షులను మార్చాలని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కార్యవర్గంలో సరిగ్గా పని చేయడం లేదని నలుగురిని తప్పించడానికి, జాతీయ నాయకత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: