ప్రధాని నరేంద్ర మోదీకి పేరు వస్తుందని... రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరు మార్చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్లంటూ తెరాస ప్రభుత్వం పేరు మార్చేసిందని వ్యాఖ్యానించారు. భాజపా ఎప్పుడూ తెరాసతో కలిసి పోటీ చేయదని స్పష్టం చేశారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేడు మూడోరోజుకు చేరింది. దీనిలో భాగంగా ఆయన తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
తెరాస ప్రభుత్వం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరు మార్చేసింది. రెండు పడక గదుల ఇళ్లు పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. కేంద్రం తెలంగాణకు 2 లక్షలకుపైగా ఇళ్లు మంజూరు చేసింది. వాటి నిర్మాణానికి కేంద్రం రూ.3,500 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.2,500 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా.. ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితా అందించలేదు. ఇళ్లు కట్టకపోవడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం వాడుకున్నారు. కానీ పేదలకు మాత్రం ఇళ్లు నిర్మించి ఇవ్వలేకపోయారు. రెండు పడక గదుల ఇళ్ల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది పేదలు అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. గుత్తేదారుల కమీషన్ల కోసమే ఇళ్లు కడుతున్నారు. అర్బన్‌లో 8 వేల ఇళ్లు మాత్రమే కట్టించారు.
ప్రజా సంగ్రామ యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి పాదయాత్రకు మద్దతు లభిస్తోంది. ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు చెబుతున్నారు. రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వంపై ప్రజలు బాధ, ఆవేశంతో ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. ఉపఎన్నికలు వస్తేనే కేసీఆర్ బయటకు వస్తారు.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
పేదలకు ఇళ్లు కట్టట్లేదు కానీ... కేసీఆర్ మాత్రం వంద గదులతో ప్రగతిభవన్ నిర్మించుకున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం నేతలతో కలిసి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఫంక్షన్ హాళ్లు కట్టుకుంటున్నారన్నారు. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి బయటకు వచ్చి రెండు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంటారని సంజయ్ అన్నారు.
ఇదీ చూడండి: EETELA RAJENDER: తెలంగాణలో ఆత్మగౌరవ పోరాటం నడుస్తోంది