కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తే.. ఆయా నిధులను తస్కరించిన దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, సంబంధిత మంత్రి, అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, కంపా నిధులు సహా కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న కేసీఆర్.. తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే పదే పదే కేంద్రం తెలంగాణకు నిధులివ్వడం లేదనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణకు కేంద్రం ఏయే పథకానికి ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో మోదీ పర్యటన ఏర్పాట్లపై ప్రిపరేటరీ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్‌తో పాటు ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, హైదరాబాద్ సెంట్రల్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు గౌతమ్ రావు, బొక్క నర్సింహారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన నిధులను తస్కరించిన దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విషయంలో సీఎం కేసీఆర్, సంబంధిత మంత్రి, అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణకు కేంద్రం ఏయే పథకానికి ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలి. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి..
'రూ.35 వేల కోట్ల సర్పంచుల నిధులను రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించింది'
'గంజాయిని ఎలుకలు తిన్నాయి'.. పోలీసుల వింత సమాధానంతో నిందితుల విడుదల