రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వస్తోన్న కమలనాథులు 2023లో అధికారమే లక్ష్యంగా నూతన జట్టును ప్రకటించారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల ముందు తెరాస, కాంగ్రెస్, తెదేపా నుంచి భాజపాలో పెద్ద ఎత్తున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరారు. పార్టీ మార్క్ కనిపించేలా పాత,కొత్త కలయికతో నూతన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర కమల దళపతిగా బండి సంజయ్‌ని ప్రకటించిన కొద్దీ రోజులకే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం వల్ల బండి తన జట్టును ప్రకటించడంలో ఆలస్యమైంది. లాక్డౌన్ సమయంలోనే పార్టీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, లక్ష్మణ్, నల్లు ఇంద్ర సేనారెడ్డితో కొత్త జట్టు కూర్పుపై పలుమార్లు చర్చించారు. సీనియర్ నేతలు, కోర్ కమిటీ అభిప్రాయాలను తెలుసుకున్న సంజయ్ చివరగా సంఘ్ పెద్దల అభిప్రాయాలను తీసుకుని జాబితాను జాతీయ నాయకత్వానికి అందించారు. జాతీయ నాయకత్వం ఆమోద ముద్ర వేయడం.. శ్రావణమాసం రావడం వల్ల బండి సంజయ్ తన జట్టును ప్రకటించారు.
కొత్తగా ఎన్నికైన కార్యవర్గం
నూతన కమీటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీమంత్రి విజయ రామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి(నల్గొండ), బండారు శోభారాణికి చోటు కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులను నియమించారు. రాష్ట్ర కార్యదర్శులుగా రఘునందన్ రావు, ప్రకాశ్ రెడ్డి, ఎం.శ్రీనివాస్ గౌడ్, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజ సత్యవతి, కె.మాధవి, జి.ఉమారాణిలకు చోటు కల్పించారు. రాష్ట్ర కోశాధికారిగా బండారి శాంతికుమార్, సహా కోశాధికారిగా భవర్‌లాల్ వర్మని నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను ప్రకటించారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా గీతామూర్తి, రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడిగా భానుప్రకాశ్, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా కృష్ణసాగర్ రావు, రజనీ కుమారి, రాకేశ్‌రెడ్డిని నియమించారు.
పార్టీ వర్గాలు అంటున్నాయి
పార్టీ సీనియర్ నేతలకు జాతీయ కమిటీలో చోటు కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. రాష్ట్ర కమిటీ కంటే ప్రత్యేక కమిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక కమిటీలకు అనుభవజ్ఞులైన నేతలను నియమించాలని యోచిస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి వచ్చేందుకు ప్రత్యేక కమిటీలే దోహదం చేశాయని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పార్టీ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి : మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద హల్చల్ చేసిన దుండగులు అరెస్టు