band navarasa team performances : ఇక్కడున్న ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి విభిన్న కోర్సులు చదివినప్పటికీ..వీరందరిని ఒక దగ్గరికి చేర్చింది....సంగీతం. సంగీతంలోనూ వీరివి భిన్న అభిరుచులు. ఒకరు పాటలు పాడటంలో దిట్టయితే... మరొకరు వాద్యాలు వాయించటంలో మేటి. తమ ప్రతిభాపాటవాలను ఒకే వేదికపై ప్రదర్శించి.. అభిమానుల ఆదరణ దక్కించుకునేందుకు సరికొత్త మ్యూజిక్ సెన్సేషనల్‌కు శ్రీకారం చుట్టారు.
తక్కువ కాలంలోనే టాప్ బ్యాండ్‌గా గుర్తింపు
చిత్తూరుకు చెందిన ఈ యువకుడి పేరు పవన్. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు. కర్ణాటక సంగీతంలో మాస్టర్స్ పూర్తి చేసిన పవన్.. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్శిటీలో సంగీతంపై పీహెచ్‌డీ చేస్తున్నారు. వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ... వయోలిన్‌తో సంగీతాభిమానుల్ని అలరిస్తున్నాడు. అదే సమయంలో.. డ్రమ్స్ వాయించే శాంసన్, గిటార్ ప్లే చేసే రాజీవ్, నితీష్, పాటలు పాడే మమన్ వంటి సంగీత కళాకారులు సంగీత ప్రయాణంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారు. వీరందరి లక్ష్యం ఒక్కటే కావడంతో... ఏకాభిప్రాయానికి వచ్చి బ్యాండ్ నవరస అనే బృందాన్ని ఏర్పాటు చేశారు. పవన్ అండ్ కో ఆధ్వర్యంలో గతేడాది ప్రారంభమైన ఈ బ్యాండ్ తక్కువ కాలంలోనే టాప్ మ్యూజిక్ బ్యాండ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
కేరళ దగ్గర బ్యాండ్ స్టయిల్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడాగుర్తింపు పొందింది. అందుకే బ్యాండ్ నవరస స్టార్ట్ చేశాం. మేమందరం కలిసి టీమ్‌గా ఫామ్ అయి ఏర్పాటు చేశాం.
పవన్, బ్యాండ్ నవరస
సాధారణంగా క్లాసికల్, వెస్టర్న్ మ్యూజిక్‌లు పలికించే బ్యాండ్‌లు ఉంటాయి. ఆ రెండింటిని కలిపి ఫ్యూజన్ చేయడమే ఈ బ్యాండ్ నవరస ప్రత్యేకత. ఈ బృందం... హైదరాబాద్‌లోనే కాదు వివిధ నగరాల్లోనూ ప్రదర్శనలు ఇస్తుంది. అంతేకాదు... వీరంతా ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పని చేస్తున్నారు.
నవరసలో మెయిన్ థీమ్ ఫ్యూజన్ ర్యాక్ బ్యాండ్. వయోలిన్, క్లాసికల్ మిక్స్ చేసి... ఫ్యూజన్ రాక్. హైదరాబాద్‌లో చాలా తక్కువగా ఉండే బ్యాండ్‌లో స్పెషల్‌గా ఉండడం కోసం ఫ్యూజన్-రాక్ చేస్తున్నాం.
పవన్, బ్యాండ్ నవరస
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో..
ఈ బృందంలో... పాడుతా తీయగా కార్యక్రమంలో సెమిఫైనల్స్ వరకు వెళ్లిన మమన్ కుమార్ కూడా ఉన్నాడు. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో డ్రమ్మర్‌గా ఉన్న సాంసన్, నితీశ్, రాజీవ్ వంటి టాలెంటెడ్ గిటారిస్టులతో బ్యాండ్‌కు తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ఓ ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని ప్రశాంతగా ముందుకు తీసుకెళ్లవచ్చు. కానీ, కళను నమ్ముకుని ముందుకు సాగడం అంత తేలికేం కాదు. అలా అని ప్రయత్నం ఆపకూడదు. సంగీతంలో సక్సెస్ అవడానికి టైం పడుతుందేమో గానీ, ఒక్కసారి విజయతీరాలకు చేరుకుంటే లభించే కిక్కే వేరు అంటున్నారు. సొంతంగా బ్యాండ్‌ను ముందుకు తీసుకెళ్లడం అంత సులువేం కాదు. ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల నుంచి కావాల్సిన ప్రోత్సాహం లభిస్తుందని చెబుతున్నాడు... పవన్.
ప్రస్తుతం నెలకు 20కు పైగా ప్రదర్శనలతో దూసుకుపోతున్న బ్యాండ్ నవరస.. త్వరలో దుబాయ్, అమెరికాలో తమ ప్రదర్శనలు ఇవ్వనుంది. దేశంలోనే టాప్ మ్యూజిక్ బ్యాండ్‌గా... బ్యాండ్ నవరసను నిలపటమే తమ ధ్యేయమంటున్నారు..ఈ యువ సంగీత కళాకారులు.
ఇదీ చదవండి: దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో తయారీ షురూ