ఈ నెల 13న బల్కంపేట(Balkampeta)లోని ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఎండోమెంట్ అధికారి అన్నపూర్ణ తెలిపారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించినా.. ఈసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
13న కల్యాణం.. 14న రథోత్సవం..
రేపు సాయంత్రం ఎదుర్కోళ్లు, 13న ఉదయం 11:11 గంటలకు నక్షత్రయుక్త కన్యా లగ్న సుముహూర్తంలో అమ్మవారి కల్యాణం, 14న దేవతా పూజలు, గణపతి హోమం, మహా శాంతి, చండీహోమం నిర్వహిస్తామని అన్నపూర్ణ తెలిపారు. సాయంకాలం పెద్దఎత్తున అమ్మవారి రథోత్సవం నిర్వహిస్తామని అన్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అన్నపూర్ణ వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య నిర్వహణ, శానిటైజేషన్ చేపట్టామని తెలిపారు.
వైద్య శిబిరాలు...
అమ్మవారి ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు భక్తులకు వైద్య సేవలను అందించేందుకు మూడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.