Balagam Movie Effect in Telangana: ఇటీవల విడుదలైన బలగం సినిమా తెలంగాణ పల్లె ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చాలా గ్రామాల్లో ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుండటంతో.. ఊరి జనమంతా మూకుమ్మడిగా ఈ మూవీని వీక్షిస్తూ భావోద్వేగాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లాలో బలగం చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే భూవివాదం కారణంగా విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను కలిపింది. తమ మధ్య ఉన్న వివాదాలను తక్షణమే పరిష్కరించుకుంటామని.. ఇప్పటి నుంచి కలిసికట్టుగా ఉంటామని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అలాగే మరోచోట తమ తండ్రిని గుర్తుచేసుకుంటూ ఇద్దరు ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసి చుట్టూ ఉన్నవారందరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా ప్రతీచోట ఏదో ఒక కదిలిక వస్తుండటంతో.. బలగం చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే గ్రామాల్లో బహిరంగంగా ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయవద్దని.. ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు పోలీసులకు ఫిర్యాదు చేసిట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఓటీటీ కంటెంట్‌ను ప్రదర్శించవద్దని.. సమీపంలోని థియేటర్లకు వెళ్లి బలగం చిత్రాన్ని వీక్షించాలని దిల్‌రాజు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
తాతలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి: బలగం సినిమా ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీక్షించారు. ఈ చిత్రం చూసినంతసేపు తాతలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరకి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే సినిమా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఇందులో భాగంగానే మరో ప్రతిష్ఠాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. ఉక్రెయిన్‌లో జరిగిన ఓనికో ఫిల్మ్ అవార్డ్స్‌లో.. ఈ సినిమాకు బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డు కైవసం చేసుకుంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పడుతూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ పలు అవార్డులను కైవసం చేసుకుంటోంది. 'జబర్దస్త్' ఫేమ్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి - కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్ పతాకంపై హన్షిత్, హర్షిత ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లతో పాటు.. ప్రముఖ ఓటీటీలో ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో ఉంది.
ఇవీ చదవండి: బలగం సినిమా చూసినంతసేపు తాతలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి: ఎర్రబెల్లి
బలగం చిత్రానికి మరో అంతర్జాతీయ అవార్డు.. సినిమా చూసి ఏడ్చేసిన జనం!
జైలు శిక్షపై కోర్టులో రాహుల్ పిటిషన్.. బెయిల్ పొడగింపు.. తదుపరి విచారణ అప్పుడే