Ayyanna patrudu and his son were doctors conducted medical tests : ఇంటి గోడ కూల్చివేత ఘటనలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడికి సింహాచలం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వారివురికి సుమారు 20 నిమిషాల పాటు ప్రభుత్వ వైద్యాధికారి భాస్కరరావు పరీక్షలు చేశారు. అయ్యన్న ఒత్తిడికి లోనవుతున్నారని.. బీపీతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐడీ కార్యాలయానికి అయ్యన్న, అతని కొడుకు రాజేశ్‌ను తీసుకొచ్చారు.
అసలేం జరిగిందంటే: ఏపీ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున పెద్దసంఖ్యలో అయ్యన్న ఇంటికి వెళ్లిన పోలీసులు, ఆయనతోపాటు చిన్న కుమారుడు రాజేశ్నూ అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడిని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
దుస్తులు మార్చుకుని వస్తానని, అయ్యన్నపాత్రుడు చెప్పినా సీఐడీ పోలీసులు దానికి అంగీకరించలేదు. అక్కడే మార్చుకోవాలని స్పష్టం చేశారు. మెడిసిన్ తెచ్చుకుంటానని చెప్పినప్పటికీ ఆయన్ను ఇంటి లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తమతో రావాలని బలవంతపెట్టారు. ఈ సమయంలో అయ్యన్న కుటుంబసభ్యులతోపాటు స్థానికులు.. పోలీసుల్ని ప్రతిఘటించారు. దీంతో స్థానికుల సెల్ ఫోన్లను పోలీసులు లాక్కున్నారు.
ఆయ్యన్నతోపాటు.. ఆయన చిన్న కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబసభ్యులకు వారిద్దరి అరెస్టు సమాచారం ఇచ్చిన పోలీసులు.. వారిని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఏలూరు సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్తామని చెప్పి సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడు, రాజేశ్‌ని విశాఖ సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. చివరికి విశాఖ సీఐడీ కార్యాలయానికి తరలించామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: