జియో ట్యాగింగ్ ఇదేం కొత్త పదం కాదు. సాధారణంగా వాహనాలు, భూములు ఇతరత్రా వాటికి జియో ట్యాగింగ్ చేస్తుంటారు. సరిగ్గా వాటి లొకేషన్ తెలుసుకునేందుకు ఈ జియో ట్యాగింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ వైద్యులను జియో ట్యాగ్ చేయటం మాత్రం మొట్టమొదటి సారి కావటం విశేషం. జియో ట్యాగ్ ద్వారా సరిగ్గా వైద్యుడు ఏ సమయానికి ఆస్పత్రికి వచ్చారు? ఎప్పుడు ఎక్కడున్నారు? తిరిగి ఎన్నిగంటలకు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఏదో పేరుకి ఆస్పత్రికి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి ఇంటికి చెక్కేసేవారికి ఇబ్బందులు తప్పదు. వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్దేశంతో ఆయుష్ విభాగంలో ఈ జియో ట్యాగింగ్ ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఈ విధానాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో దీని అమలుకు అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టింది. ఇక ఈ నెల 21న కరీంనగర్లో మొదలు పెట్టిన జియో ట్యాగింగ్ ప్రక్రియను ఈ నెల 31 న ఆదిలాబాద్ లో పూర్తి చేయనుంది.
ఉద్యోగి తన స్మార్ట్ ఫోన్లో జియో ట్యాగింగ్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ వేలి ముద్రతో యాక్టివేట్ అవుతుంది. ఇలా యాక్టివేట్ చేస్తేనే ఆరోజు వారు విధుల్లోకి వచ్చినట్టు లెక్క.
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది:
ఇంతవరకు బాగానే ఉన్నా.... ప్రస్తుత కాలంలో వ్యక్తిగత సమాచారమంతా సెల్ ఫోన్లలోనే నిక్షిప్తమవుతుంది. అలాంటి ఫోన్‌ని జియో ట్యాగ్ చేస్తే తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆయుష్ వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము జియో ట్యాగింగ్‌ని వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు. కావాలంటే సర్కారు ప్రత్యేకంగా ఇందుకోసం మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి వాటిని జియో ట్యాగ్ చేయాలని కోరుతున్నారు. తమ వ్యక్తిగత ఫోన్ల జియో ట్యాగింగ్కి ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. ఆయుష్ వైద్యులకు అల్లోపతి వైద్యులు సైతం తమ సంఘీభావం ప్రకటించారు. ఆయుష్‌తో ప్రారంభించి అల్లోపతికి దీనిని అమలు చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని... ఇది సరి కాదని వాపోతున్నారు.
మొత్తానికి ప్రభుత్వం తలపెట్టిన జియో ట్యాగింగ్ రగడ రాజుకుంటోంది. సీసీ టీవీలు, బయోమెట్రిక్ విధానాలు అమల్లో ఉండగా ఇంకా జియో ట్యాగింగ్ అవసరమేంటని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.