MINISTER GANGULA: తడిసిన ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా వేలం వేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ప్రభుత్వానికి నష్టం రాకుండా వేలం ప్రక్రియ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో చాలా జిల్లాల్లో ధాన్యం తడుస్తోంది. బియ్యం సేకరణను పునరుద్ధరించటంలో కేంద్రం తీవ్ర జాప్యం చేయటంతోనే ఈ పరిస్థితి నెలకొంది. సుమారు రూ.10 వేల కోట్లు వెచ్చించి 50 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా కొన్నామని తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని వేలం వేయటం ఒక్కటే మార్గమని, లేనిపక్షంలో మరింత దెబ్బతింటుందని సీఎం కేసీఆర్‌కు వివరించామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వేలం నిర్వహణపై సుముఖత వ్యక్తం చేశారు. విధివిధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల కన్నా జెమ్ పోర్టల్ ద్వారా నిర్వహించాలని యోచిస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మార్చలేం. ఉప్పుడు బియ్యానికే ఉపయోగపడతాయని మంత్రి గంగుల వివరించారు.