హైదరాబాద్ పటేల్ నగర్‌లో మహేందర్ అనే వ్యక్తి భవన్ లాల్ పేరుతో డిస్పోజబుల్ వస్తువుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అతని వద్ద అబ్దుల్ మన్సూర్ అహ్మద్ గత కొంత కాలంగా ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కాగా కార్యాలయానికి సంబంధించిన నగదు 1,16, 500, పలు చెక్కులను ఉస్మాన్ గంజ్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో డిపాజిట్ చేయమని యజమాని మహేందర్ అహ్మద్‌కు ఇచ్చాడు.
అప్పటికే బ్యాంకు ముందున్న ఓ వ్యక్తి అహ్మద్‌ను పలకరించి తాను ఆజ్మీర్ దర్గా నుంచి వచ్చానని... తన వద్ద తినడానికి డబ్బులు లేవని పది రూపాయల సహాయం చేయమని కోరాడు. ఇంతలో మరో వ్యక్తి అక్కడికి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలను వింటున్నట్లు నటిస్తూ నిలబడ్డాడు. అనంతరం అహ్మద్‌ను నువ్వు చాలా కషాల్లో ఉన్నావని... నువ్వు బాగుపడాలంటే నీకు దువా చేస్తానని నమ్మించాడు.
కొద్ది సేపటి తరువాత అగరబత్తీలు వెలిగించి దువా చదివినట్లు చదివి ... వెనుకకు తిరగకుండా పది అడుగులు దూరం వెళ్లి రావాలని చెప్పాడు. అతను చెప్పినట్లు అహ్మద్ బ్యాగును అక్కడే పెట్టి, పది అడుగుల దూరం వెళ్లి వచ్చేసరికి ఇద్దరు దుండగులు నగదు, చెక్కులు ఉన్న బ్యాగ్‌ను తీసుకొని ఆటోలో పారిపోయారు. దీనితో షాక్‌కు గురైన అహ్మద్, ఈ విషయాన్ని యజమాని మహేందర్‌కు సమాచారం అందించాడు. అనంతరం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి:ట్రంప్‌తోపాటు ఆ దేశాధినేతకూ కరోనా ముప్పు!