Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'అసని'.. ఎట్టకేలకు తీరాన్ని తాకింది. తీరం దాటిన అనంతరం తుపాను నుంచి తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఆర్ధరాత్రి సమయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్నట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను "అసని" ఏపీలోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరం దాటింది. తీరాన్నీ దాటిన అనంతరం తుపాను స్థాయి నుంచి బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారినట్టు వాతావరణశాఖ తెలియచేసింది. ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతోందన్న వాతావరణశాఖ.. ఆర్ధరాత్రి సమయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. మచిలీపట్నం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్రవాయుగుండం.. ఈశాన్యదిశగా కదులుతూ నర్సాపురం, పాలకొల్లు, అమలాపురం, యానాం, కాకినాడ మీదుగా మళ్లీ సముద్రంలోకి వెళ్లే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది. ఆ తర్వాత మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాయుగుండం కదులుతున్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. మరోవైపు కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఇప్పటికే ప్రకటించిన రెడ్ అలెర్ట్ ను అధికారులు కొనసాగిస్తున్నారు. మచిలీట్నం, విశాఖ, నిజాంపట్నం, కాకినాడ, భీమిలి, కళింగపట్నం, గంగవరం పోర్టుల్లో జారీ చేసిన 7 నెంబరు ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగిస్తున్నారు.
అంతకు ముందు : పలు మార్లు దిశ మార్చుకుంటూ తీరం వైపు ప్రయాణించింది అసని. దీంతో.. నరసాపురానికి దగ్గరలో తీరం దాటుతుందని ఓసారి, కోనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని మరోసారి ఇలా అంచనాలు వచ్చాయి. మొత్తానికి పలు మలుపులు తిరిగిన తుపాను.. చివరకు కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరం దాటింది
అధికారుల అప్రమత్తం : కోస్తా జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే మెరైన్ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో ప్రవేశాలను నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను రక్షిత భవనాలనూ సిద్ధంగా ఉంచారు. కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల రక్షిత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హార్బర్‌లో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసని తీవ్రతపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలను సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వివరించారు.
ఇవీ చూడండి: