ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలకు జాతీయ పరీక్షల సంస్థ.. (ఎన్టీఏ) సిద్ధమవుతోంది. ఈ ఏడాది నాలుగు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి జేఈఈ మెయిన్స్ ఈనెల 23 నుంచి 26 వరకు జరగనుంది. ఈ వారంలో అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో పెట్టేందుకు ఎన్టీఏ సన్నాహాలు చేస్తోంది.
అత్యధికంగా ఏపీ నుంచి..
తొలి పరీక్ష రాసేందుకు దేశ వ్యాప్తంగా 6 లక్షల 61 వేల 761 మంది దరఖాస్తు చేశారు. మొదటి విడత పరీక్ష కోసం దేశంలోనే అత్యధికంగా ఏపీ నుంచి 87,797, ఆ తర్వాత మన రాష్ట్రం నుంచి 73,782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం నాలుగు విడతలకు కలిపి 21.75 లక్షల దరఖాస్తులు అందాయి.
మరో 12 భాషల్లోనూ..
నాలుగు విడతలు కలిపి అత్యధికంగా మహారాష్ట్ర నుంచి, ఆ తర్వాత ఏపీ, యూపీ, తెలంగాణల నుంచి దరఖాస్తులు అందాయి. ఏపీ నుంచి నాలుగు విడతలకు కలిపి సుమారు 2 లక్షల 54 వేల 918, తెలంగాణ నుంచి 2 లక్షల 26 వేల 935 దరఖాస్తులు నమోదయ్యాయి. తెలుగులో పరీక్ష రాసేందుకు ఇప్పటి వరకు 371 దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది ఆంగ్లంతో పాటు మరో 12 భాషల్లోనూ జేఈఈ నిర్వహిస్తున్నారు.
ఇతర భాషల్లో రాసేందుకు..
ఆంగ్లం కాకుండా ఇతర భాషల్లో రాసేందుకు నాలుగు విడతలకు కలిపి లక్షా 49 వేల 621 దరఖాస్తులు నమోదయ్యాయి. హిందీలో రాసేందుకు 76,459, ఆ తర్వాత అత్యధికంగా గుజరాతీలో 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 దరఖాస్తులు అందాయి.
దేశ వ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తుండగా.. ఏపీలో 20, తెలంగాణలో పది నగరాలు, పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్టీఏ నిర్ణయించింది.