ఈనెల 11న జరగనున్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు ఉదయం 10.45 గంటల వరకు నూతన సభ్యులు కౌన్సిల్హాల్కు చేరుకోవాలని ఎన్నికల అధికారి కోరారు. ప్రతి సభ్యుడు తమ ఫొటో కలిగిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. సమావేశం నిర్వహణను తెలియజేస్తూ ఇప్పటికే జీహెచ్ఎంసీ పంపిన లేఖను కూడా సభ్యులు తీసుకురావాలని సూచించారు.
ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి కేవలం సభ్యులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. తప్పని సరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని.. మాస్కులను ధరించాలని స్పష్టం చేశారు. హాల్లో పార్టీల ప్రాతిపదికగా సభ్యులకు తమ వార్డుల పేర్లను తెలియజేస్తూ అక్షర క్రమంలో సీట్ల కేటాయింపు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రతి లైన్లో సహాయకారిగా ఉండేందుకు రో-అధికారుల నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సభ్యుడు ఏ సీటులో కూర్చోవాలో ఈ అధికారులు తెలియజేస్తారని.. సమావేశంపై ఏదైన సందేహాలు ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులను గానీ, సెక్రటరీని గానీ సంప్రదించాలన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల పక్రియ నిర్వహణపై వివరించేందుకు మంగళవారం జీహెచ్ఎంసీలో ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలి: ఎంపీ అర్వింద్