DOPT AllotmentsIssue on Telangana High Court : తెలంగాణ, ఏపీలకు ఐఏఎస్, ఐపీఎస్‌లు కేటాయింపుల వివాదాలపై విచారణ వచ్చే నెల 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. వాదనలు వినిపించేందుకు కేంద్ర వ్యక్తిగత, శిక్షణ శాఖ తరపు న్యాయవాది సమయం కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇరు రాష్ట్రాలకు డీవోపీటీ కేటాయించింది.
డీవోపీటీ కేటాయింపులను సవాల్ చేస్తూ 14 మంది అధికారులు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. గతంలో దీనిపై విచారణ జరిపిన క్యాట్.. అధికారులకు అనుకూలంగా 2016లో తీర్పులు వెల్లడించింది. ట్రైబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో డీవోపీటీ పిటిషన్లు వేసింది. ఐపీఎస్ అధికారులు ఏవీ రంగనాథ్, సంతోష్ నెహ్రా మధ్యలోనే పిటిషన్లను వెనక్కి తీసుకోగా.. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు వివాదంపై తీర్పు వెల్లడించింది.
- రాష్ట్రంలో ఏపీ కేడర్ అధికారులు.. డీఓపీటీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
- ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా
డీజీపీ అంజనీ కుమార్‌తో పాటు సి.హరికిరణ్, జి.అనంత రాము, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణి ప్రసాద్, గుమ్మల్ల శ్రీజన, ఎస్ఎస్ రావత్, కె.అమ్రపాలి, ఎల్.శివశంకర్, అభిలాష బిస్తి, అభిషేక్ మహంతి, రొనాల్డ్ రోస్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. కేంద్రం సమయం కోరడంతో పిటిషన్లపై విచారణను జులై 3వ తేదీకి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం వాయిదా వేసింది.
ఏంటి ఈ వివాదం..?: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేడర్‌కి వెళ్లినా.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్నారు. డీవోపీటీ ఆదేశాలపై అప్పట్లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్‌కి వెళ్లి స్టేతెచ్చుకొని తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ తరువాత మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కేసు విచారణ సమయంలో సదరు అధికారుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విచారణ సమయంలో వాదనలు వినిపించిన ప్రభుత్వం.. అందరు అధికారులకు సంబంధించి కౌంటర్ దాఖలు వేసింది.
రాష్ట్ర కేడర్‌లో కొనసాగుతున్న అధికారుల పరిస్థితి ఏమిటి?: సోమేశ్ కుమార్ తరహాలో క్యాట్ స్టే ఆధారంగా.. రాష్ట్ర కేడర్‌లో కొనసాగుతున్న అధికారుల పరిస్థితిపై గతంలో చర్చ నడిచింది. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ అదే తరహాలో తెలంగాణలో కొనసాగుతున్నారు. మరో ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్.. ఏపీ కేడర్ అయినా తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ వాణిప్రసాద్, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంతి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న అమ్రపాలి తదితర అధికారుల పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
ఇవీ చదవండి