హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు... ప్రతిష్టాత్మకంగా నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని... క్షేత్రస్థాయిలో జలమండలి వేగవంతం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ జారీ చేశారు.
ఈ పథకాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఎస్పీఆర్ హిల్స్, రెహమత్ నగర్, బోరబండ లో ఈ నెల 12న ప్రారంభించారు. అయితే ఈ పథకాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి జలమండలి సిద్ధం అయ్యింది. మీటర్ ఏర్పాటు చేసి ... ఆధార్ అనుసంధానంతో ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
డొమెస్టిక్ స్లమ్ వినియోగదారుల కనెక్షన్లకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రధాన కార్యాలయంలో... ఒక రోజు శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది. మిగతా డొమెస్టిక్ వినియోగదారులు దగ్గరలోని మీ-సేవా కేంద్రాల వద్దకు వెళ్లి లేదా జలమండలి వెబ్ సైటు ను సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పథకాన్ని పొందాలంటే డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న మిగతా వినియోగదారులు వారి కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
మీటరు ఏర్పాటు... ఆధార్ అనుసంధానం తదితర విషయాలపై జలమండలి మరింత సమాచారం రూపొందించింది. ఈ పథకం ద్వారా లబ్ది పొందడానిక ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ... మార్చి 31తో గడువు ముగిసినప్పటికీ... ఏప్రిల్ 1, 2021 వరకు జలమండలి అవకాశం కల్పించింది
ఇదీ చదవండి: పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై నేడు సీఎం సమీక్ష