Land Values in TS: రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్ల కొత్త రిజిస్ట్రేషన్ విలువలకు.. విలువల పెంపు కమిటీలు శనివారం ఆమోదముద్ర వేశాయి. కలెక్టరేట్లలో సమావేశమైన పట్టణ, గ్రామీణ మార్కెట్ విలువల పెంపు కమిటీలు... కొత్త మార్కెట్ విలువలను ఆమోదించాయి. 2021 జులై 22న రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన ప్రభుత్వం... తాజాగా మరోసారి సవరించింది. వ్యవసాయ భూముల విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35శాతం, అపార్ట్‌మెంట్ల విలువలు 25 శాతం పెరగనున్నాయి. పెరిగిన కొత్త మార్కెట్ విలువలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది.
అత్యంత విలువైన ప్రాంతంగా బంజారాహిల్స్
కొత్త మార్కెట్ విలువల ప్రకారం రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతంగా బంజారాహిల్స్ నిలిచింది. రూ.84,500లుగా ఉన్న చదరపు గజం విలువ.... తాజా పెంపుతో రూ.లక్షా 14 వేల 100 అయ్యింది. రెండోస్థానంలో హైదరాబాద్ పాతబస్తీలోని దివాన్‌దేవిడి నిలిచింది. ఇక్కడ చదరపు గజం 78 వేల నుంచి లక్షా 5వేలకు పెరిగింది. అత్యధిక విలువ కలిగిన తొలి ఐదు ప్రాంతాలుగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని బంజారాహిల్స్, దివాన్‌దేవిడి, సికింద్రాబాద్ ఎస్సీ రోడ్, కాచిగూడ క్రాస్ రోడ్, రెజిమెంటల్ బజార్లు నిలిచాయి. హైదరాబాద్ జిల్లా తర్వాత మేడ్చల్ జిల్లాలోని బేగంపేట, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మాల్కాజిగిరి, హబ్సీగూడ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గడ్డి అన్నారం, మదీనాగూడ, ఎల్బీనగర్, ఖానామెట్, హయత్‌నగర్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఖమ్మంలో ఇలా..
హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా అత్యధిక విలువలు కలిగిన నగరంగా ఖమ్మం నిలిచింది. పెరిగిన విలువల ప్రకారం ఖమ్మంలో చదరపు గజం 52,700రూపాయలు. కరీంనగర్‌లో చదరపు గజం రూ.43,900 కాగా, నిజామాబాద్, రామగుండంలో రూ.38 వేలుగా ఉంది. రామచంద్రాపురం, భువనగిరిలో రూ.37,800 చొప్పున చదరపు గజం విలువ పెంచారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అపార్ట్‌మెంట్‌ల గరిష్ఠ విలువ రూ.9,500గా నిర్ణయించారు. దివాన్‌దేవిడి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జిల్లా కేంద్రాల్లో కంటే ఇతర పట్టణాల్లోనే..
రాష్ట్రంలోని కొన్ని జిల్లా కేంద్రాల కంటే ఇతర పట్టణాల్లో ఎక్కువ విలువ కలిగి ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ములుగులో అత్యల్పంగా చదరపు గజం ధర రూ.1250గా ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం, జగిత్యాల జిల్లా కోరుట్ల, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, మెదక్ జిల్లా తూప్రాన్, వికారాబాద్ జిల్లా పరిగి, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నారాయణపేట జిల్లా మక్తల్‌లో..... జిల్లా కేంద్రాల్లోని విలువల కంటే అధికంగా ఉన్నాయి.
ఫిబ్రవరి 1నుంచే అమలు..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పెంచిన కొత్త విలువలు అమలుకు అనుగుణంగా సాప్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేస్తోంది. మంగళవారం నుంచి కొత్త మార్కెట్ విలువలు రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్నాయి.
ఇదీ చదవండి: