seediri appala raju : ఏపీ పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖలోని శారదాపీఠం ముఖద్వారం వద్ద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బుధవారం ఉదయం మంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరయ్యారు. అప్పటికి ఇంకా సీఎం జగన్ రాలేదు. మంత్రి అప్పలరాజు పీఠం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లేటప్పుడు ఆయనతో పాటు ఉన్న పలాస పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ పూర్ణచంద్రరావు, ఆయన అనుచరులను సీఐ రాజుల్‌నాయుడు అడ్డుకోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేయి వేసి ముందుకు తోశారు.
‘సీఎం మాకు దేవుడు. ఆయన చిత్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాం. ఇక్కడ మాత్రం నచ్చితే రా.. లేకపోతే మానేయ్ అనడానికి ఎవడీయన. నాకు అర్థం కాదు. ఏయ్ బాబూ... తమాషాలు చేస్తున్నావా? చొక్కా పట్టుకొని లాగేస్తా (ఇక్కడో అసభ్యకర పదం వాడారు). పిచ్చిపిచ్చి వేషాలా? ఎలా కనిపిస్తున్నాం? మీ కమిషనర్‌ని రమ్మనండి. పిలిపిస్తారా లేదా? ఆ భాషకి మాకు అర్థం తెలియాలి కదా... ముందు సీపీని రమ్మనండి. మంత్రిని కదాని నాతోపాటు మా కుర్రోళ్లు సరదాపడి వచ్చారు. అందులో పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ ఉన్నారు. అలాంటిది ఆయన ఏమన్నాడో తెలుసా? నీకు నచ్చితే నువ్వు రా.. లేకపోతే నువ్వూ (సీఐ ఇక్కడ అసభ్యకర పదం వాడారని మంత్రి పేర్కొన్నారు). అదేంటో మాకు తెలియాలి కదా’ అని మండిపడ్డారు. ఆ తర్వాత ‘అయ్యా మీకో నమస్కారం’ అంటూ అక్కడి నుంచి వెనుదిరిగి కారులో వెళ్లిపోయారు. వెళ్లిపోతున్న మంత్రిని పోలీసు అధికారులు సముదాయించేందుకు ప్రయత్నించారు. ఎంత బతిమిలాడినా అసహనం వ్యక్తం చేయడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఈ సమయంలో మంత్రి అనుచరులు సీఐని సస్పెండ్ చేయాలని, క్షమాపణ చెప్పించాలని నినాదాలు చేశారు. మంత్రిని అడ్డుకున్న సీఐ ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు.
చర్యలు తీసుకోరా?: బండారు
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని మంత్రి అప్పలరాజు చొక్కా పట్టుకుని తోసేసినా చర్యలు తీసుకోరా అని తెదేపా మాజీమంత్రి బండారు సత్యనారాయణరావు ప్రశ్నించారు. ‘ఆయనపై చర్యలు తీసుకునే ధైర్యం డీజీపీకి లేదా? ఇది ఎంత సిగ్గుచేటో పోలీసు సంఘం నేతలు ఆలోచించాలి. ఇంత జరిగితే హోం మంత్రి సుచరిత ఏం చేస్తున్నారు? మంత్రి అప్పలరాజును బర్తరఫ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. సీఎం వచ్చారని 16 గంటల పాటు మందుల దుకాణాలు సహా అన్నీ మూసివేయించారు గానీ, మద్యం దుకాణాల్ని కొనసాగించారని బండారు అన్నారు. విశాఖలో అంతసేపు కర్ఫ్యూ విధించి మరీ సీఎం పర్యటించారని... దానివల్ల ప్రజలంతా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ప్రజల్ని వేధించినందుకు సీఎం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : విశాఖ శారదాపీఠం వద్ద ఏపీ మంత్రి అప్పలరాజు అనుచరుల ఆందోళన